
ఒక్కో మ్యాచ్‌కు రూ. 6 కోట్లు?
లండన్: అంతా అనుకున్నట్లు జరిగితే... ప్రపంచ టెన్నిస్ నంబర్‌వన్ రాఫెల్ నాదల్ ఒక్క మ్యాచ్‌కే కోట్లు వెనకేసుకుంటాడు. భారత టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి ఆలోచనకు ప్రతిరూపమైన అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో నాదల్ బరిలోకి దిగితే అతనికి ఒక్కో మ్యాచ్‌కు 10 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 20 లక్షలు) ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో నిర్వహించే ఈ టెన్నిస్ లీగ్ ఈ ఏడాది నవంబరు 28 నుంచి డిసెంబరు 20 వరకు బ్యాంకాక్, కౌలాలంపూర్, ముంబై, సింగపూర్, హాంకాంగ్‌లలో జరుగుతుంది. దుబాయ్‌లో ఆదివారం జరిగే వేలంపాటలో ఐదు ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేస్తాయి.
నాదల్‌తోపాటు రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్), బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే... మహిళల విభాగంలో సెరెనా విలియమ్స్ (అమెరికా), విక్టోరియా అజరెంకా (బెలారస్), మాజీ నంబర్‌వన్ వొజ్నియాకి (డెన్మార్క్), అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) ఈ లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తితో ఉన్నారని సమాచారం. అయితే 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత, స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ మాత్రం ఈ లీగ్‌పట్ల ఆసక్తి కనబర్చడంలేదు.