రహానేకు ‘ఎ’ గ్రేడ్
‘బి’కి పడిపోయిన సురేశ్ రైనా
ముంబై: వచ్చే ఏడాది కాలానికి క్రికెటర్లకు బీసీసీఐ గ్రేడింగ్‌లు ప్రకటించింది. గత ఏడాది కాలంగా నిలకడగా రాణిస్తూ వచ్చిన అజింక్య రహానేకు తొలి సారి ‘ఎ’ గ్రేడ్ కాంట్రాక్ట్ దక్కింది. వన్డే, టి20 కెప్టెన్ ధోని, టెస్టు కెప్టెన్ కోహ్లిలతో పాటు జట్టు ప్రధాన స్పిన్నర్ ఆర్. అశ్విన్‌లు మాత్రమే ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్నారు. వీరికి ఏడాదికి రూ. కోటి కాంట్రాక్ట్ మొత్తం లభిస్తుంది. మరో వైపు వరుసగా విఫలమవుతూ వస్తున్న భువనేశ్వర్, వన్డేల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన సురేశ్ రైనాలను ‘ఎ’ గ్రేడ్‌నుంచి తొలగించి ‘బి’ గ్రేడ్‌లో ఉంచారు. ఈ గ్రేడ్‌లోని రవీంద్ర జడేజా, ప్రజ్ఞాన్ ఓజాలు ‘సి’కి పడిపోగా...‘సి’లో ఉన్న ఏడుగురు యువ ఆటగాళ్లు తమ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. ‘బి’ గ్రేడ్ ఆటగాడికి రూ. 50 లక్షలు, ‘సి’ గ్రేడ్ ఆటగాడికి రూ. 25 లక్షలు లభిస్తాయి. ఈ ఏడాది ఆటగాళ్ల సంఖ్య 32నుంచి 26కు తగ్గడం విశేషం.
మిథాలీరాజ్‌కు ‘ఎ’ గ్రేడ్
బీసీసీఐ తొలి సారి మహిళా క్రికెటర్లకు కూడా కాంట్రాక్ట్‌లు ప్రకటించింది. రూ. 15 లక్షలు లభించే ‘ఎ’ గ్రేడ్‌లో మిథాలీరాజ్‌తో పాటు జులన్, హర్మన్‌ప్రీత్, తిరుష్‌కామినిలకు స్థానం లభించగా, మరో ఏడుగురు ‘బి’ గ్రేడ్ (రూ. 10 లక్షలు)లో ఉన్నారు.