
న్యూఢిల్లీ: భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్టు డిసెంబర్ 6 నుంచి జరుగనుంది. అయితే దానికి ముందు జట్టులోని టెస్టు స్పెషలిస్ట్‌లకు తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ కావాలని భావించిన బీసీసీఐ వారిని ‘ఎ’జట్టులో చేర్చింది. న్యూజిలాండ్ ‘ఎ’తో ఈ నెల 16 నుంచి మౌంట్ మాంగనీలో జరిగే నాలుగు రోజుల తొలి అనధికారిక టెస్టులో తలపడే భారత ‘ఎ’జట్టు తరఫున వీరు బరిలోకి దిగనున్నారు. టెస్టు ఆటగాళ్లు రహానే, మురళీ విజయ్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, పార్థివ్ పటేల్, హనుమ విహారి ఈ టీమ్‌లో ఉన్నారు. దీనిపై ‘ఎ’జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... ఆస్ట్రేలియాతో పోలిస్తే న్యూజిలాండ్‌లో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని అభిప్రాయపడ్డాడు.
అయితే ప్రాక్టీస్ పరంగా మాత్రం ఇది సీనియర్లకు ఉపకరిస్తుందని అతను అన్నాడు. ‘ఎ టీమ్ తరఫున ఆడబోతున్న సీనియర్లకు ఇది మంచి అవకాశం. న్యూజిలాండ్‌తో పోలిస్తే ఆస్ట్రేలియాలో పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నా సరే వారందరికీ మంచి మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది. ఇటీవల బిజీ షెడ్యూల్‌ల కారణంగా ప్రాక్టీస్ గేమ్‌లకు ఎక్కువగా అవకాశం ఉండటం లేదు. పైగా ‘ఎ’మ్యాచ్‌లు కూడా పోటాపోటీగా సాగుతున్నాయి. దానిని బట్టి చూస్తే ప్రధాన సిరీస్‌కు ముందు ఇలాంటి మ్యాచ్ మేలు చేస్తుంది’అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టు అద్భుతంగా రాణిస్తోందని కాబట్టి ‘ఎ’ పర్యటనల్లో ఎక్కువగా టెస్టు మ్యాచ్‌లు ఉండేలా చూసుకుంటున్నామని, టెస్టుల కోసం కుర్రాళ్లకు ఎక్కువ అనుభవం రావాలనేది తమ ఉద్దేశమని రాహుల్ ద్రవిడ్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment