ద్రవిడ్ కొడుకు.. చితక్కొట్టాడు!
రాహుల్ ద్రవిడ్ అనగానే ద వాల్ అనే పేరు ఠక్కున గుర్తుకొస్తుంది. జట్టు విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వికెట్ పడకుండా కాపాడుకోవడమే కాక.. అత్యంత క్లాసీ షాట్లు ఆడటంలో ద్రవిడ్‌ను మించినవాళ్లు లేరని అంతర్జాతీయ క్రికెట్ పరిశీలకులు, విమర్శకులు కూడా చెబుతారు. అలాంటి ద్రవిడ్ కొడుకు.. అచ్చంగా తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. గట్టిగా పదేళ్ల వయసు ఉందో లేదో.. అప్పుడే అండర్ -14 క్లబ్ క్రికెట్‌లో సెంచరీ బాదేశాడు. బెంగళూరు యునైటెడ్ క్రికెట్ క్లబ్ (బీయూసీసీ)కి ప్రాతినిధ్యం వహిస్తున్న సమిత్ ద్రవిడ్.. టైగర్ కప్ క్రికెట్ టోర్నమెంటులో ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూలు జట్టుపై 125 పరుగులు చేశాడు. అందులోనూ 12 బౌండరీలున్నాయి. బీయూసీసీ తరఫునే ఆడుతున్న మరో ఆటగాడు ప్రత్యూష్ 143 నాటౌట్‌గా నిలిచాడు. వీళ్లిద్దరూ చెలరేగడంతో బీయూసీసీ జట్టు 246 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
సమిత్ ద్రావిడ్ ఇలా చెలరేగి ఆడటం ఇదే మొదటిసారి కాదు. గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో అండర్ -12 గోపాలన్ క్రికెట్ చాలెంజ్ టోర్నమెంటులో అతడు బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎంపికయ్యాడు. అప్పుడు వరుసగా 77 నాటౌట్, 93, 77 చొప్పున పరుగులు చేసి, తన జట్టును గెలిపించాడు. తన కొడుకు బ్యాటింగ్ తీరు పట్ల ద్రావిడ్ కూడా పొంగిపోతున్నాడు. అతడి కళ్లకు, చేతులకు మధ్య మంచి సమన్వయం ఉందని, బాల్ రాగానే దాన్ని స్మాష్ చేసేస్తాడని.. అలాగే చేయమని తాను కూడా చెబుతున్నానని ద్రావిడ్ అన్నాడు. ఎంతైనా పుత్రోత్సాహం కదా..!