రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచండి
న్యూఢిల్లీ: రంజీ ఆటగాళ్ల ఫీజులను పెంచే విషయంపై నూతన పరిపాలక కమిటీ (సీఓఏ)తో మాట్లాడాలని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లేను స్పిన్నర్ హర్భజన్ కోరాడు. ఈనెల 21న సీఓఏకు భారత సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల వేతనాల సవరింపుపై కుంబ్లే నివేదిక ఇవ్వనున్నారు. ఈనేపథ్యంలో రంజీ ఆటగాళ్ల గురించి కూడా మాట్లాడాలని భజ్జీ సూచించాడు. రంజీ ఆటగాళ్లలో కొంతమంది ఐపీఎల్ పుణ్యమా అని కోట్లు సంపాదిస్తున్నా సగటు ఆటగాడు మాత్రం ఫస్ట్‌క్లాస్ క్రికెట్ (రంజీ, దులీప్ ట్రోఫీ)లో మ్యాచ్ ఫీజు కింద లక్షన్నర పొందుతున్నాడు. అదే ఓ టెస్టు ఆటగాడు రూ.15 లక్షలు పొందుతాడు. ఇది ఆటగాళ్లలో ఆర్థికంగా అభద్రతాభావానికి గురిచేస్తోందని కుంబ్లేకు హర్భజన్ ఇటీవల ఓ లేఖ రాశారు. ‘నేను రెండు మూడేళ్లుగా రంజీల్లో ఆడుతున్నాను.
ఈ సమయంలో నాతోటి ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆటగాళ్ల ఆర్థిక ఇబ్బందులను చూసి చలించిపోయాను. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని అర్జిస్తున్న క్రికెట్ బోర్డు ఈ ట్రోఫీ నిర్వహిస్తున్నా ఇలాంటి పరిస్థితి ఉండడం దారుణం. 2004 నుంచి వీరి ఫీజులో మార్పులు కూడా జరగలేదు. అప్పటి వందకు ఇప్పటి వంద రూపాయలకు తేడా ఎంతో మారింది. ఏడాదికి ఎంత సంపాదిస్తామో కూడా తెలీకుండా వారు జీవితంలో ఎలాంటి ప్రణాళికలు వేసుకోగలరు? దయచేసి ఈ అసమానతను బీసీసీఐ పెద్దలకు, సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, వీరూలాంటి ఆటగాళ్లకు చేరేలా చూడండి’ అని కుంబ్లేకు రాసిన లేఖలో భజ్జీ ఆవేదన చెందాడు. వందల్లో ఉన్న ఆటగాళ్లలో చాలా కొద్దిమందికే ఐపీఎల్ కాంట్రాక్ట్ లభిస్తోందని, అయితే వారు కూడా ప్రొఫెషనల్ ఆటగాళ్లే అని గుర్తుచేశాడు.
ఎక్కువ కోరడంలో తప్పు లేదు: గావస్కర్
మరోవైపు మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఏడాదిలో 81 రోజులపాటు మ్యాచ్‌లు ఆడే దేశవాళీ ఆటగాళ్లు దాదాపు రూ.40 లక్షల వరకు మాత్రమే సంపాదించగలరని అన్నారు. అదే ఓ అనామక ఆటగాడు ఐపీఎల్‌లో ఆడే 16 మ్యాచ్‌ల్లోనే దాదాపు రూ.4 కోట్ల వరకు వెనకేసుకుంటాడని చెప్పారు. బీసీసీఐకి డబ్బు సంపాదించి పెడుతోంది ఆటగాళ్లే కాబట్టి వారు ఎక్కువ కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేశారు.