రాజా రిత్విక్‌కు రజతం
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్కూల్స్ చెస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ కుర్రాడు రాజా రిత్విక్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అఖిల భారత చెస్ సమాఖ్య ఆధ్వర్యంలో నాగ్‌పూర్‌లో జరిగిన ఈ టోర్నీ అండర్-13 విభాగంలో రిత్విక్ రన్నరప్‌గా నిలిచాడు. తొమ్మది రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లు సాధించి రజతాన్ని దక్కించుకున్నాడు. ఆదివారం మెహతా నైతిక్ (8, గుజరాత్)తో జరిగిన చివరి గేమ్‌ను రిత్విక్ (8) డ్రా చేసుకున్నాడు.
ఇద్దరి స్కోర్లు సమం కావడంతో మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా మెహతాను విజేతగా ప్రకటించారు. దీంతో రిత్విక్‌కు రెండో స్థానం దక్కింది. ప్రస్తుతం రాజా రిత్విక్ జూబ్లీహిల్స్‌లోని ఆర్కిడ్‌స ఇంటర్నేషనల్ స్కూల్‌లో 8వ తరగతి చదువుతున్నాడు. జాతీయ స్థారుులో సత్తా చాటిన రాణించిన రిత్విక్‌ను రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు ఎ. నరసింహారెడ్డి, కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వర రావు అభినందించారు. ఈ టోర్నీలో మొత్తం 100 మంది క్రీడాకారులు తలపడ్డారు. గతంలో రిత్విక్ కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో రజతం, ఆసియన్ చెస్ చాంపియన్‌షిప్స్ (2013, 2014, 2015)లో స్వర్ణాలతో పాటు పలు జాతీయ పతకాలను సాధించాడు.