రాజస్తాన్‌... ఇంకా ఉంది! | Rajasthan Royals crush Sunrisers Hyderabad to stay in playoffs hunt | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌... ఇంకా ఉంది!

Published Sun, Apr 28 2019 1:03 AM | Last Updated on Sun, Apr 28 2019 12:03 PM

Rajasthan Royals crush Sunrisers Hyderabad to stay in playoffs hunt - Sakshi

‘ప్లే ఆఫ్‌’ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ అదరగొట్టింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై విజయంతో రేసులోకి వచ్చింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ పాయింట్ల పట్టికలో పైపైకి ఎదుగుతోంది. ఆరో పరాజయంతో హైదరాబాద్‌ జట్టేమో ముందుకెళ్లే అవకాశాల్ని పీకలమీదికి తెచ్చుకుంది. మొత్తానికి రాయల్స్‌ విజయంతో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అధికారికంగా ప్లే ఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.   

జైపూర్‌: గత మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ను ఓడించిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఈసారి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు జలక్‌ ఇచ్చింది. బౌలింగ్, బ్యాటింగ్‌లో చక్కని ప్రదర్శన కనబరిచిన రాయల్స్‌ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌పై విజయం సాధించింది. ముందుగా సన్‌రైజర్స్‌ 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. మనీశ్‌ పాండే (36 బంతుల్లో 61; 9 ఫోర్లు) అర్ధశతకం బాదాడు. రాయల్స్‌ బౌలర్లలో వరుణ్‌ ఆరోన్, థామస్, శ్రేయస్‌ గోపాల్, ఉనాద్కట్‌ తలా 2 వికెట్లు తీశారు. తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసి గెలిచింది. సామ్సన్‌ (32 బంతుల్లో 48 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), లివింగ్‌స్టోన్‌ (26 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. షకీబ్, రషీద్‌ చెరో వికెట్‌ తీశారు. ఉనాద్కట్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’అవార్డు అందుకున్నాడు.  

పాండే పరుగెత్తించినా... 
రాజస్తాన్‌ టాస్‌ నెగ్గి ఫీల్డింగ్‌కు మొగ్గుచూపింది.  హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ను వార్నర్‌తో ప్రారంభించిన విలియమ్సన్‌ (13) విఫలమయ్యాడు. దీంతో క్రీజులోకి వచ్చిన మనీశ్‌ పాండే తొలి బంతినే బౌండరీకి తరలించాడు. డాషింగ్‌ ఓపెనర్‌ షాట్లు కొట్టేందుకు ఇబ్బంది పడుతుంటే... పాండే మాత్రం స్కోరుబోర్డును బౌండరీలతో పరుగు పెట్టించాడు. శ్రేయస్‌ గోపాల్‌ బౌలింగ్‌లో 2, పరాగ్‌ ఓవర్లో మరో రెండు ఫోర్లు బాదాడు. 10 ఓవర్లలో 86/1 స్కోరు చేసింది. ఆ తర్వాత జట్టు స్కోరు 100 పరుగులదాకా రైజర్స్‌ కుదురుగానే సాగింది. ఈ క్రమంలో పాండే 27 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. మరోవైపు 12 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నా ఒక్క బౌండరీ కొట్టలేకపోయిన వార్నర్‌ (32 బంతుల్లో 37)ను థామస్‌ ఔట్‌ చేయగా, కాసేపటికి మనీశ్‌ పాండే దూకుడుకు శ్రేయస్‌ గోపాల్‌ బ్రేక్‌వేశాడు. 

సాగేకొద్దీ కూలింది... 
పాండే ఔటయ్యే సమయానికి హైదరాబాద్‌ స్కోరు 15 ఓవర్లలో 121/3. ఇంకా చేతిలో 7 వికెట్లున్నాయి. దీంతో భారీస్కోరు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నా... ఎందుకనో ‘సన్‌’ఇన్నింగ్స్‌ విలవిలలాడింది. 4.4 ఓవర్ల వ్యవధిలో 26 పరుగులే చేసిన రైజర్స్‌ అనూహ్యంగా 5 వికెట్లను కోల్పోయింది. విజయ్‌ శంకర్‌ (8) మొదలుకొని షకీబుల్‌ (9), దీపక్‌ హుడా (0), సాహా (5) వరకు అందరూ మంచి బ్యాట్స్‌మెనే అయినా... రాయల్స్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు తలవంచారు. సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 

మెరిపించిన లివింగ్‌స్టోన్‌... 
లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ రాయల్స్‌ 2 ఓవర్లలో 8 పరుగులు చేసింది. మూడో ఓవర్‌ మొదలవడంతోనే వేగం కూడా మొదలైంది. భువీ బౌలింగ్‌ రహానే 2 బౌండరీలు బాదగా... 4వ ఓవర్లోనే స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ను రంగంలోకి దించాడు హైదరాబాద్‌ కెప్టెన్‌ విలియమ్సన్‌. కానీ... రహానే, లివింగ్‌స్టోన్‌ చెరో సిక్సర్‌ కొట్టడంతో అతని పాచికపారలేదు. సిద్ధార్థ్‌ వేసిన ఆరో ఓవర్లో లివింగ్‌స్టోన్‌ చెలరేగాడు. 4, 0, 6, 0, 4, 6తో 20 పరుగులు పిండుకున్నాడు. దీంతో చేయాల్సిన 161 పరుగుల్లో ఈ 6 ఓవర్లలోనే అవలీలగా 60 పరుగుల్ని చేసేసింది. రషీద్‌ పదో ఓవర్లో లివింగ్‌స్టోన్‌ను ఔట్‌ చేయడం ద్వారా 78 పరుగుల శుభారంభం ముగిసింది. తర్వాత రహానే (39; 4 ఫోర్లు, 1 సిక్స్‌) షకీబ్‌ బౌలింగ్‌లో వార్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. అదే ఓవర్లో స్మిత్‌ బౌండరీ బాదడంతో జట్టు స్కోరు వందకు చేరింది. సామ్సన్, స్మిత్‌ కుదురుగా ఆడి రాయల్స్‌ను గెలుపుబాట పట్టించారు. ఖలీల్‌ బౌలింగ్‌లో భారీషాట్‌కు యత్నించిన స్మిత్‌ (16 బంతుల్లో 22; 3 ఫోర్లు) సిద్ధార్థ్‌ కౌల్‌ చేతికి చిక్కాడు. అప్పటికి రాయల్స్‌ లక్ష్యానికి 13 పరుగుల దూరంలోనే ఉండగా మిగతా లాంఛనాన్ని సామ్సన్, టర్నర్‌ పూర్తి చేశారు. 

రేసువత్తరం 
ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో ఎప్పుడూ చివరి స్థానంలో నిలిచే రాజస్తాన్‌ రాయల్స్‌కు... లీగ్‌ ఆఖర్లో పుంజుకుని ప్రత్యర్థి జట్ల ప్లే ఆఫ్‌ అవకాశాలను దెబ్బతీసే జట్టుగానూ పేరుంది. ఈసారీ ఆ జట్టు ఇదే పనిచేస్తోంది. గురువారం కోల్‌కతాపై, శనివారం సన్‌రైజర్స్‌పై గెలు పొందడం ద్వారా ఆ రెండు జట్ల నాకౌట్‌ ప్రవేశాన్ని సందిగ్ధంలో పడేసింది. దీంతోపాటు ప్లే ఆఫ్స్‌ రేసును మరింత రసవత్తరంగా మార్చింది. అంతేకాక, 12 మ్యాచ్‌లలో 10 పాయింట్లతో తాను కూడా తదుపరి దశకు పోటీలో నిలిచింది. తాజాగా సన్‌రైజర్స్‌ ఓటమితో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (16 పాయింట్లు) ప్లే ఆఫ్‌ బెర్తు అధికారికంగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఢిల్లీ–బెంగళూరు, కోల్‌కతా–ముంబై మధ్య జరిగే రెండు మ్యాచ్‌లకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గెలిస్తే ఢిల్లీ, ముంబై 16 పాయింట్లతో ముందుకెళ్తాయి. ఇదే సమయంలో ఓడితే... కోల్‌కతా, బెంగళూరు సహా పంజాబ్, హైదరాబాద్, రాజస్తాన్‌ పదేసి పాయింట్లతో సమానంగా ఉంటాయి. వీటిలో కోల్‌కతా మినహా మిగతా నాలుగు జట్ల మధ్య సోమ, మంగళవారాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో?   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement