రాజస్థాన్ రాజసం | Rajasthan Royals inflict 9th defeat on Delhi Daredevils in IPL 7 | Sakshi
Sakshi News home page

రాజస్థాన్ రాజసం

Published Fri, May 16 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 7:23 AM

రాజస్థాన్ రాజసం

రాజస్థాన్ రాజసం

ఐపీఎల్-7లో ఏకపక్షంగా ముగిసిన మ్యాచ్‌ల్లో మరొకటి చేరింది. ఈసారి కూడా అందులో ఢిల్లీ పాత్ర ఉంది. రాజస్థాన్ సమష్టి ప్రదర్శనతో రెండొందలకు పైగా స్కోరు చేస్తే...పది ఓవర్లు ముగిసే సరికే ఢిల్లీ చేతులెత్తేసింది.
 
 ప్లే ఆఫ్ రేసు నుంచి నిష్ర్కమించినా ఆ జట్టు ఆటతీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. మరో వైపు భారీ విజయంతో రాజస్థాన్ తమ ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగు పర్చుకుంది.
 
 అహ్మదాబాద్: ఐపీఎల్ మాజీ చాంపియన్ రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ దశకు మరింత చేరువైంది. బ్యాటింగ్‌లో రహానే (50 బంతుల్లో 64; 8 ఫోర్లు, 1 సిక్స్), శామ్సన్ (25 బంతుల్లో 40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించగా.. బౌలర్లు సమష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ 62 పరుగుల తేడాతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై విజయం సాధించింది. గురువారం అహ్మదాబాద్‌లోని మొతేరాలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 201 పరుగులు చేసింది.
 
 రహానే, శామ్సన్‌తో పాటు కూపర్ (16 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఫాల్క్‌నర్ (8 బంతుల్లో 23 నాటౌట్; 3 సిక్స్‌లు) రాణించారు. ఆ తర్వాత ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. మనోజ్ తివారి (44 బంతుల్లో 61 నాటౌట్; 5  ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే రాణించాడు. రహానేకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
 
 రహానే, శామ్సన్ మెరుపులు
 కెప్టెన్ షేన్ వాట్సన్ తుది జట్టులో లేకుండానే బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు రహానే, కరుణ్ నాయర్ శుభారంభాన్ని ఇచ్చారు. ఢిల్లీ బౌలర్లపై మొదటినుంచి వీరు ఆధిక్యం ప్రదర్శించడంతో పవర్ ప్లేలో స్కోరు 52 పరుగులకు చేరింది.

వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెవాన్ కూపర్ ఉన్నంతసేపు దడదడలాడించాడు. రెండు ఫోర్లు, మూడు సిక్స్‌లు కొట్టి జోరుమీదున్న కూపర్ (32)ను డుమిని వెనక్కిపంపాడు. కూపర్ స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన సంజు శామ్సన్ జట్టు స్కోరును పెంచే బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. కౌల్ వేసిన ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదాడు.  
 
 ఇన్నింగ్స్ 16వ ఓవర్‌లో రాజస్థాన్ స్కోరు 150 పరుగులు దాటిన తర్వాత రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ మరింతగా విజృంభించారు. స్కోరు పెంచే ప్రయత్నంలో రహానే(64) అవుటయ్యాడు. మూడో వికెట్‌కు శామ్సన్‌తో కలిసి రహానే 74 పరుగులు జోడించారు. చివర్లో ఫాల్క్‌నర్ (23 నాటౌట్) విజృంభించడంతో రాయల్స్ స్కోరు రెండొందలు దాటింది.  చివరి ఐదు ఓవర్లలో రాజస్థాన్ 60 పరుగులు రాబట్టింది.
 
 బ్యాట్స్‌మెన్ వైఫల్యం
 లక్ష్యఛేదనను ధాటిగా ప్రారంభించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ మూడో ఓవర్‌లోనే తొలి వికెట్ చేజార్చుకుంది. వ్యక్తిగత స్కోరు 4 పరుగుల దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అగర్వాల్ (17) ఎక్కువసేపు క్రీజ్‌లో నిలవలేకపోయాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కార్తీక్ (3) తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. జట్టు స్కోరు నెమ్మదించడంతో ఢిల్లీ పవర్ ప్లేలో 34 పరుగులు మాత్రమే చేసింది.
 
 డుమిని (8)ని తాంబే వెనక్కి పంపగా... భాటియా వరుస ఓవర్లలో పీటర్సన్ (13), టేలర్ (4)లను అవుట్ చేశాడు.  దీంతో 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఆ తర్వాత ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. ఇక 6 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న మనోజ్ తివారి ధాటిగా బ్యాటింగ్ చేసినా.. మిగిలిన బ్యాట్స్‌మెన్ జాదవ్ (3), నదీమ్ (1), తాహిర్ (4), శుక్లా (14) విఫలమయ్యారు. ఫలితంగా వరుసగా ఆరో ఓటమి తప్పలేదు.
 
 పీటర్సన్...రనౌట్ కథ!
 రనౌట్‌లో కూడా నాటౌట్‌గా మిగలడం ఢిల్లీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కే సాధ్యమేమో...ఈ సారి ఐపీఎల్‌లో ఒకటి కాదు రెండు సార్లు, అదీ రాజస్థాన్‌తో మ్యాచుల్లోనే ఇది చోటు చేసుకోవడం విశేషం. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఫాల్క్‌నర్ బౌలింగ్‌లో కార్తీక్ షాట్ ఆడగా పీటర్సన్ సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే పాయింట్ స్థానంనుంచి ఉన్ముక్త్ విసిరిన బంతి నేరుగా వికెట్లను తాకింది. అయితే పీటర్సన్ క్రీజ్‌లోకి చేరుకున్నాడని భావించిన రాజస్థాన్ పెద్దగా అప్పీలు చేయలేదు. దాంతో అంపైర్లూ పట్టించుకోలేదు. అయితే రీప్లేలో చూస్తే కెవిన్ ఖచ్చితంగా అవుటే! అతని బ్యాట్ క్రీజ్‌కు కాస్త బయటే ఉండిపోయింది.
 
 కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో కేపీ బతికిపోయాడు. రాజస్థాన్‌తోనే జరిగిన గత మ్యాచ్‌లో కూడా పీటర్సన్ రనౌట్ అయినట్లు స్పష్టంగా కనిపించినా ఫీల్డ్ అంపైర్ రీప్లే కోరకపోవడంతో నాటౌట్‌గా మిగిలాడు. దీనిపై జట్టు కెప్టెన్ వాట్సన్ తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఆ తర్వాత అంపైర్ సంజయ్ హజారేను లీగ్‌నుంచి సస్పెండ్ చేశారు. అయితే రెండు సార్లు రనౌట్ అయి కూడా నాటౌట్‌గా ప్రకటించుకోగలగడం పీటర్సన్‌ను కూడా ఆశ్చర్యపరచి ఉంటుంది.
 
 స్కోరు వివరాలు
 రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్: రహానే (బి) నదీమ్ 64; నాయర్ ఎల్బీడబ్ల్యూ (బి) నదీమ్ 19; కూపర్ (సి) శుక్లా (బి) డుమిని 32; శామ్సన్ (సి) జాదవ్ (బి) తాహిర్ 40; స్టువర్ట్ బిన్ని (స్టంప్డ్) కార్తీక్ (బి) తాహిర్ 0; కటింగ్ రనౌట్ 8; ఫాల్క్‌నర్ నాటౌట్ 23; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) : 201.
 వికెట్ల పతనం: 1-44; 2-93; 3-167; 4-168; 5-169; 6-201.
 బౌలింగ్: డుమిని 3-0-25-1; రాహుల్ శుక్లా 4-0-44-0; కౌల్ 3-0-34-0; నదీమ్ 4-0-35-2; తాహిర్ 4-0-25-2; మనోజ్ తివారి 2-0-28-0.
 
 ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: పీటర్సన్ (బి) భాటియా 13; అగర్వాల్ (సి) స్మిత్ (బి) ఫాల్క్‌నర్ 17; కార్తీక్ (సి) కటింగ్ (బి) కులకర్ణి 3; డుమిని (సి) నాయర్ (బి) తాంబే 8; తివారి నాటౌట్ 61; రాస్ టేలర్ (సి) అండ్(బి) భాటియా 4; జాదవ్ రనౌట్ 3; నదీమ్ (బి) కటింగ్ 1; తాహిర్ (బి) బిన్ని 4; శుక్లా (సి) స్మిత్ (బి) కూపర్ 14; కౌల్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం ( 20 ఓవర్లలో 9 వికెట్లకు) : 139.
 
 వికెట్ల పతనం: 1-19; 2-30; 3-43; 4-48; 5-58; 6-75; 7-86; 8-91; 9-120.
 బౌలింగ్: కులకర్ణి 4-1-24-1; కటింగ్ 4-0-31-1; ఫాల్క్‌నర్ 1-0-6-1; కూపర్ 3-0-19-1; తాంబే 3-0-24-1; భాటియా 3-0-18-2; బిన్ని 2-0-14-1.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement