కోల్‌కతా: భారత టెన్నిస్ బృందం వ్యూహం పని చేయలేదు. క్లే, హార్డ్ కోర్టులపై అద్భుతంగా ఆడే ఇటలీ ఆటగాళ్లకు అంతగా అలవాటు లేని పచ్చిక కోర్టులను మ్యాచ్‌ల కోసం ఎంచుకున్నా మనకు కలిసి రాలేదు. డేవిస్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా శుక్రవారం ఇక్కడ జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత ఆటగాళ్లకు ఓటమి తప్పలేదు. రామ్‌కుమార్ రామనాథన్ 71 నిమిషాల్లో ఆండ్రియా సెప్పి చేతిలో... ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 57 నిమిషాల్లో మాటియో బెరెటిని చేతిలో ఓడిపోయారు. ఫలితంగా తొలి రోజే ఇటలీ 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. నేడు జరిగే డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్‌లలో ఒక దాంట్లోనైనా నెగ్గితే ఇటలీ ఈ ఏడాది నవంబర్‌లో జరిగే డేవిస్ కప్ ఫైనల్స్ టోర్నీకి బెర్త్ ఖాయం చేసుకుంటుంది. ఆతిథ్య భారత్ మాత్రం ఫైనల్స్‌కు చేరాలంటే మూడు మ్యాచ్‌ల్లోనూ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ ఆండ్రియా సెప్పి 6–4, 6–2తో ప్రపంచ 129వ ర్యాంకర్ రామ్‌కుమార్‌ను ఓడించి ఇటలీకి 1–0 ఆధిక్యాన్ని అందించాడు. రామ్‌కుమార్ ఎనిమిది ఏస్‌లు సంధించినా, ఆరు డబుల్ ఫాల్ట్‌లు కూడా చేశాడు. నెట్ వద్దకు 24సార్లు దూసుకొచ్చిన రామ్‌కుమార్ ఆరుసార్లు మాత్రమే పాయింట్లు గెలిచాడు. 25 అనవసర తప్పిదాలు చేసిన అతను సెప్పి సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు రెండుసార్లు అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోలేదు. మరోవైపు సెప్పి మూడుసార్లు రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేశాడు.
రెండో సింగిల్స్‌లో భారత నంబర్‌వన్, ప్రపంచ 102వ ర్యాంకర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 4–6, 3–6తో ప్రపంచ 50వ ర్యాంకర్, డేవిస్ కప్‌లో తొలిసారి ఆడుతున్న మాటియో బెరెటిని చేతిలో ఓటమి చవిచూశాడు. ఇటీవల ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ డేవిస్ కప్‌లో మాత్రం తడబడ్డాడు. మ్యాచ్ మొత్తం లో ఒక్క ఏస్ కూడా కొట్టలేకపోయిన ప్రజ్నేశ్ ప్రత్యర్థి సర్వీస్‌లో ఒక్క బ్రేక్ పాయింట్ అవకాశాన్ని దక్కించుకోలేదు. అయితే.. ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను మాత్రం మూడుసార్లు కోల్పోయాడు. ‘నేడు జరిగే మూడు మ్యాచ్‌లపై దృష్టి సారిస్తాం. ఈ మూడింట్లో గెలిస్తేనే ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధిస్తామన్న సంగతి తెలుసు. ఇటలీలాంటి మేటి జట్టుతో ఆడే సమయంలో అందివచ్చిన అవకాశా లను అనుకూలంగా మల్చుకోవాలి. అలా చేయకపోతే మూల్యం చెల్లించుకుంటాం. భారత ఆటగాళ్ల విషయంలో అదే జరిగింది’ అని భారత నాన్ ప్లే యింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి వ్యాఖ్యానించాడు.
ఇద్దరూ చేతులెత్తేశారు
Published Sat, Feb 2 2019 12:22 AM | Last Updated on Sat, Feb 2 2019 12:22 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment