రామన్ రాజీనామా
బీసీసీఐ ఆమోదం
ఐపీఎల్ సీఓఓగా ఎనిమిదేళ్లు సేవలు
ముంబై: భారత క్రికెట్‌లో మరో పెను మార్పు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆరంభం నుంచి దాని ముఖ్య కార్యనిర్వాహణాధికారి (సీఓఓ)గా పని చేసిన సుందర్ రామన్ తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం సాయంత్రం నాగ్‌పూర్ వెళ్లి బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్‌కు రాజీనామా పత్రం అందించారు. దీనిని వెంటనే ఆమోదిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ‘సుందర్ తన రాజీనామాను శశాంక్‌కు అందించారు. దీనిని బీసీసీఐ ఆమోదించింది. ఐపీఎల్ కోసం రామన్ సర్వశక్తులూ ఒడ్డి కష్టపడ్డారు. ఇందుకు ఆయనను అభినందిస్తున్నాం’ అని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా చెప్పారు.
అయితే రామన్ రాజీనామా విషయంలో ఎవరి బలవంతం లేదని అన్నారు. ‘రామన్‌కు వ్యతిరేకంగా ఎక్కడా ఎలాంటి నివేదికలు లేవు. బహుశా తన మనసులో వేరే ఆలోచన ఉండి ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి తప్పుకోవాలని అనుకున్నారు’ అని శుక్లా అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో రామన్ హస్తం ఉందని తేల్చిన జస్టిస్ ముద్గల్ కూడా రాజీనామా సరైన నిర్ణయమని అన్నారు. ‘రెండేళ్ల క్రితం నివేదికలో ఆయన పేరు వచ్చినప్పుడే రాజీనామా చేసి ఉంటే బాగుండేది. అయితే వ్యక్తిగత నిర్ణయాలు ఒక్కొక్కరివి ఒక్కోలా ఉంటాయి. ఏమైనా రామన్ రాజీనామా చేయడం మంచి పరిణామం’ అని ముద్గల్ అన్నారు.