భారత్‌లో క్రికెట్ ప్రేమికుల వేసవి వినోదం ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎనిమిదో ఎడిషన్ ద్వారా 50 రోజుల పాటు టి20 క్రికెట్ మజాను అభిమానులు పూర్తిగా ఆస్వాదించారు. ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించిన ముంబై ఇండియన్స్ జట్టు రెండోసారి టైటిల్ సాధించింది. ప్రతి సీజన్‌లోనూ నిలకడగా ఆడే చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఫైనల్‌కు వచ్చింది. ఎనిమిది సీజన్లలోనూ నాకౌట్‌కు అర్హత సాధించిన ధోనిసేన ఆరోసారి ఫైనల్ ఆడింది. అయితే ఇందులో నాలుగు ఓడిపోవడం ఆ జట్టు ఆలోచించాల్సిన అంశం. లీగ్ ఆరంభ దశలో వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయి, ప్లే ఆఫ్‌లకు వెళ్లాలంటే కచ్చితంగా ప్రతి మ్యాచ్‌లోనూ గెలవాల్సిన స్థితిలో ఉండి కూడా ముంబై ఇండియన్స్ అద్భుతం చేసింది. చివరి దశలో వరుస విజయాలతో టైటిల్ హస్తగతం చేసుకుంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు కూడా ప్లే ఆఫ్‌కు చేరుకున్నా... కొందరు క్రికెటర్ల వ్యక్తిగత ప్రదర్శనపై ఆధారపడి మూల్యం చెల్లించుకున్నాయి. క్రిస్‌గేల్, డివిలియర్స్, కోహ్లిల రూపంలో ముగ్గురు స్టార్స్ ఉండటం, ముగ్గురూ ఫామ్‌లో ఉండటంతో ఈ ఏడాది బెంగళూరు జట్టు అభిమానులను బాగా ఆకట్టుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుది మరో కథ. చివరి రెండుమ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా ప్లే ఆఫ్‌కు వెళ్లే పటిష్ట స్థితిలో ఈ జట్టు రెండు మ్యాచ్‌లూ ఓడింది. డేవిడ్ వార్నర్ లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచినా ఆ జట్టు ప్లే ఆఫ్ దశను దాటలేకపోయింది. బ్యాటింగ్ లైనప్‌లో భారత హిట్టర్స్ లేకపోవడం ఈ జట్టును వేధించింది. డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా సరిగ్గా హైదరాబాద్‌లాగే నిష్ర్కమించింది. ముంబై ఇండియన్స్‌పై ఆఖరి ఓవర్ వరకూ అద్భుతంగా ఆడి ఆ ఒక్క ఓవర్‌లో పీయూష్ చావ్లా పేలవ ఆటతీరు కారణంగా ఓడిపోయింది. ఆ ప్రభావం తర్వాతి మ్యాచ్‌లోనూ పడటంతో ఈసారి ప్లేఆఫ్‌లకు చేరలేకపోయింది. టోర్నీలో అందరికంటే పేలవంగా ఆడిన జట్లు ఢిల్లీ డేర్‌డెవిల్స్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్. గత ఏడాది సంచలన ఆటతీరుతో ఫైనల్ వరకూ వచ్చిన పంజాబ్ ఈసారి పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైపోయింది. మ్యాక్స్‌వెల్, బెయిలీ, మిల్లర్, సెహ్వాగ్‌లాంటి స్టార్ క్రికెటర్లెవరూ తమ స్థాయికి తగ్గట్లుగా ఆడకపోవడంతో పంజాబ్ నిరాశను మిగుల్చుకుంది. గత ఏడాది ప్రదర్శనతో ఈ సారి ఈ జట్టుకు అందరికంటే అత్యధికంగా 13 కంపెనీలు స్పాన్సర్స్‌గా వ్యవహరించాయి. ఆ కంపెనీలన్నింటినీ పంజాబ్ జట్టు నిరాశపరిచింది. గత ఏడాది పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ఢిల్లీ ఈసారి జట్టును బాగా మార్చింది. డబ్బుకు వెరవకుండా వేలంలో యువరాజ్, మాథ్యూస్‌లను తీసుకొచ్చింది. అయినా ఫలితంలో మాత్రం పెద్దగా మార్పు రాలేదు. చివరి నుంచి రెండో స్థానంతో సరిపెట్టుకుంది.
టి20 క్రికెట్ ఆడటానికి వయసుతో సంబంధం లేదని ఈ సీజన్‌లోనూ కొంతమంది నిరూపించారు. 44 ఏళ్ల వయసులో బ్రాడ్‌హాగ్, 43 ఏళ్ల ప్రవీణ్ తాంబే ఈ ఏడాది కూడా సత్తా చాటారు. 36 ఏళ్ల వయసున్న ఆశిష్ నెహ్రా 22 వికెట్లు తీసి తనలో చేవ తగ్గలేదని చూపించాడు. అయితే వయసు కారణంగా వీళ్ల ప్రతిభ కేవలం ఐపీఎల్‌కే పరిమితం కానుంది.
భారత జట్టులోకి రావడానికి ఐపీఎల్ షార్ట్‌కట్‌గా మారింది. 2008లో తొలి సీజన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రతి సీజన్‌లోనూ కొత్త క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. అలాగే రెండేళ్లుగా భారత జట్టులో చోటు కోసం పరితపిస్తున్న హర్భజన్ సింగ్ ఈ సీజన్ ద్వారా మళ్లీ జట్టులో స్థానం సంపాదించాడు. ఇక వెలుగులోకి వచ్చిన యువ సంచలనాలకూ కొదవలేదు. ఢిల్లీ జట్టుకు ఆడిన ముంబై కుర్రాడు శ్రేయేష్ అయ్యర్ అందరినీ ఆకట్టుకున్నాడు. రాజస్తాన్‌కు ఆడిన దీపక్ హుడా, ముంబైకి ప్రాతినిథ్యం వహించిన హార్దిక్ పాండ్య, సుచిత్‌లతో పాటు బెంగళూరు జట్టులో ఆడిన హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్ కూడా సెలక్టర్ల దృష్టిలో పడ్డారు. వయసు, ఆటతీరును పరిగణనలోకి తీసుకుంటే వీరిలో అయ్యర్ చాలా త్వరలోనే భారత జట్టు తలుపు తట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. 17 ఏళ్ల సర్ఫరాజ్ ఖాన్ బెంగళూరు జట్టుకు ఆడి గేల్, డివిలియర్స్‌ల దగ్గర చాలా పాఠాలు నేర్చుకున్నాడు. ఐపీఎల్‌లో ఉన్న అందమే ఇది. భారత యువ క్రికెటర్లు దిగ్గజాలతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం ద్వారా అనుభవం గడిస్తున్నారు. ఈ ఏడాది అలాంటి అనుభవం యువ క్రికెటర్లకు దొరికింది.
ఈసారి పెద్దగా వివాదాలు లేకుండానే టోర్నీ ముగియడం సంతోషించదగ్గ పరిణామం. లీగ్ ఆరంభానికి ముందే రాజస్తాన్ జట్టులోని ఓ యువ క్రికెటర్‌ని బుకీలు సంప్రదించారనే వార్త కలకలం రేపింది. క్రికెట్ అభిమానులను కలవరపరిచింది. అయితే, ఈసారి అలాంటి దొంగాటలకు ఆస్కారం లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి మ్యాచ్‌లోనూ అవినీతి నిరోధక అధికారులు వేయికళ్లతో ఆటగాళ్లను గమనించారు. ఫలితంగా ఈసారి మచ్చ తెచ్చే వ్యవహారాలు జరిగినట్లుగా వార్తలు రాలేదు. అలాగే మైదానం బయట కూడా పార్టీల హడావుడి కూడా పెద్దగా లేదు. దీంతో పూర్తిగా క్రికెట్ మీదే ఫోకస్ పెట్టారు. గత సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లకు వీక్షకుల సంఖ్య పెరిగిందని, టోర్నీ ఘన విజయం సాధించిందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించింది.
చిన్న పట్టణాలకు క్రికెట్‌ను విస్తరించాలనే ఆలోచన చాలా కాలంగా ఉంది. ఇందులో భాగంగానే 8 జట్లే ఉన్నా 12 నగరాల్లో 13 వేదికల్లో మ్యాచ్‌లు జరిగాయి. అలాగే ఈసారి కొత్తగా ఫ్యాన్‌పార్క్‌లను ఏర్పాటు చేశారు. మన దగ్గర గుంటూరు, వరంగల్‌లో ఫ్యాన్ పార్క్‌లు ఏర్పాటు చేశారు. గుంటూరులో దేశంలోనే అత్యధికంగా 20 వేల మంది ఈ ఫ్యాన్ పార్క్‌కు వచ్చి పెద్ద స్క్రీన్ మీద మ్యాచ్‌లు చూశారు. ఐపీఎల్ వ్యాపారాన్ని మరింత పెంచడానికి ఈ ఫ్యాన్ పార్క్‌లు ఉపయోగపడతాయని బీసీసీఐ ఆలోచన. ఆ కోణంలోంచి చూస్తే ఇవి కూడా హిట్ అయినట్లే.
భళా... ఐపీఎల్!
Published Wed, May 27 2015 12:12 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement