ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి | IPL COO ... beyond | Sakshi

ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి

Published Wed, Nov 4 2015 12:12 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి

ఐపీఎల్ సీఓఓ ...అంతకు మించి

‘క్రికెట్‌కు భారత్ నుంచే అధిక ఆదాయం వస్తున్నప్పుడు... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిధుల వాటా విషయంలో అందరితో సమానంగా ఎందుకు ఉండాలి? కాబట్టి... భారత్‌కు ఎక్కువ వాటా ఇవ్వాలి. ఇది ఇష్టం లేకపోతే చెప్పండి... ఐసీసీ నుంచి బీసీసీఐ బయటకు వెళ్లి సొంతంగా క్రికెట్ నిర్వహించుకుంటుంది’... ఏడాదిన్నర క్రితం ప్రపంచ క్రికెట్‌ను వణికించిన స్టేట్‌మెంట్ ఇది. అంతకాలం మిగిలిన దేశాలతో పాటు సమానంగా ‘చిల్లర’ తీసుకున్న బీసీసీఐ... ఈ ఏడాది నుంచి ఐసీసీ వాటాలో అధిక మొత్తాన్ని సంపాదించడానికి కారణం ఆ స్టేట్‌మెంట్. దీనిని రూపొందించిన వ్యక్తి సుందర్ రామన్. ఐపీఎల్ సీఓఓగానే ఆయన ప్రపంచానికి తెలుసు. కానీ గత ఎనిమిదేళ్లలో సుందర్ రామన్ ఓ శక్తిగా ఎదిగారు. ముఖ్యంగా గత మూడేళ్లుగా ఆయన భారత క్రికెట్‌ను శాసిస్తున్నారు. శ్రీనివాసన్ సన్నిహితుడిగా పేరున్న రామన్ అనుమతి లేనిదే బీసీసీఐలో ఒక్క ఫైల్ కూడా కదల్లేదు. కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఎవరినైనా తొలగించాలన్నా... బోర్డుకు సంబంధించి ఏ మార్పు జరగాలన్నా సుందర్ రామన్ అనుమతి ఉండాల్సిందే. అంత బలంగా ఎదిగాడు.
 
ఎక్కడి నుంచి వచ్చాడు?

2004లో సుందర్ రామన్ ‘మీడియా ప్లానర్’ అనే రోల్‌తో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. 2004లో ఈఎస్‌పీఎన్‌లో చేరి కామెంటేటర్స్ కోసం టాలెంట్ హంట్ నిర్వహించగా, ఆ కార్యక్రమంలో విఫలమయ్యారు. ఆ తర్వాత ‘మైండ్‌షేర్’ అనే గ్లోబల్ మీడియా ఏజెన్సీలో చేరారు. ఆ సమయంలోనే లలిత్ మోడీకి దగ్గరయ్యారు. 2007లో ఐపీఎల్ ఆలోచన రాగానే లలిత్ మోడీ తొలుత కలిసింది సుందర్ రామన్‌నే. ఈ ఇద్దరూ భారత్‌లో టి20 లీగ్ ద్వారా ప్రపంచ క్రికెట్ రాతను మార్చారు. బీసీసీఐపై కాసుల వర్షం కురిపించారు. ఆ తర్వాత మోడీని లీగ్ నుంచి బయటకు పంపినా... రామన్‌ను మాత్రం ఎవరూ కదిలించలేకపోయారు. ఇదే సమయంలో రామన్... శ్రీనివాసన్‌కు సన్నిహితంగా మారారు. గత మూడు సంవత్సరాలుగా బీసీసీఐలో రామన్ చెప్పిందే వేదం. ఇదే సమయంలో శ్రీనివాసన్ ఐసీసీ చైర్మన్‌గా ఎంపిక కావడంతో రామన్ అక్కడకూ వెళ్లారు. అన్ని ఐసీసీ సమావేశాల్లో ఆయన శ్రీనివాసన్‌కు ‘షాడో’ అనే పేరు కూడా వచ్చింది. తన తెలివితేటలతో, లెక్కలతో రామన్ బీసీసీఐ ఆదాయాన్ని గణనీయంగా పెంచారు.

 స్పాట్ ఫిక్సింగ్ వివాదం
 2013 స్పాట్ ఫిక్సింగ్ కేసు సమయంలో సుందర్ రామన్ పేరు కూడా వినిపించింది. ఆ సీజన్‌లో రామన్ ఒక బుకీతో ఎనిమిది సార్లు మాట్లాడాడని ముద్గల్ కమిటీ పేర్కొంది. తాను ఒక వ్యక్తితో మాట్లాడిన మాట వాస్తవమే అని, అయితే అతను బుకీ అనే విషయం తనకు తెలియదని ముద్గల్ కమిటీ ముందు రామన్ చెప్పారు. అలాగే గురునాథ్ మెయ్యప్పన్, రాజ్ కుంద్రా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలిసినా ఐపీఎల్ సీఓఓ హోదాలో ఉండి కూడా ఆయన చర్యలు తీసుకోలేదని కమిటీ పేర్కొంది. ఆ తర్వాత లోధా కమిటీ కూడా రామన్‌ను తప్పు పట్టింది. ఈ నెల 15న లోధా కమిటీ ముందు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది.

ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటే...
నిజానికి 2013లో స్పాట్ ఫిక్సింగ్ వివాదం సమయంలోనే రామన్ రాజీనామా చేయాల్సింది. కానీ అప్పుడు అంతా శ్రీనివాసన్ హవా. కాబట్టి ఐపీఎల్ కౌన్సిల్ కూడా రామన్‌ను సమర్థించింది. అయితే ఇటీవల కాలంలో మారిన సమీకరణాల నేపథ్యంలో ఇప్పుడు రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. శశాంక్ మనోహర్ బీసీసీఐ అధ్యక్షుడు కాగానే అడిగిన తొలి ప్రశ్న... ‘రామన్ ఎందుకు కొనసాగుతున్నాడు’ అని. అక్టోబరు 31లోగా రాజీనామా చేయకపోతే... నవంబరు 9న జరిగే బీసీసీఐ వార్షిక సమావేశంలో తొలగిస్తామని శశాంక్ నేరుగా రామన్‌కు చెప్పేశారు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక తప్పుకున్నారు. ఇక ఈ కేసు విషయానికొస్తే... ఐపీఎల్ సీఓఓగా అనేక మంది వ్యక్తులను కలవడం తన బాధ్యతల్లో భాగమని, తాను కలిసిన వారిలో బుకీ ఉన్నాడనే విషయం తనకు తెలియదని రామన్ ఇప్పటికే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
 
శశాంక్ అండ్ కో... బోర్డులోని శ్రీనివాసన్ సన్నిహితులందరినీ బయటకు పంపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగమే సుందర్ రామన్ రాజీనామా. అయితే భారత క్రికెట్ ఆదాయం పెరుగుదలలో సుందర్ రామన్ పాత్ర మాత్రం ఎప్పటికీ బోర్డు చరిత్రలో ఉంటుంది.     
-సాక్షి క్రీడావిభాగం
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement