44 పరుగులకే ఆలౌటైన 40 సార్లు రంజీ చాంపియన్
కర్ణాటకకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
ఒకే రోజులో 22 వికెట్లు
బెంగళూరు: భారత దేశవాళీ క్రికెట్‌లో ముంబై జట్టుది తిరుగులేని రికార్డు. ఏకంగా 40 సార్లు రంజీ చాంపియన్‌గా నిలిచిన ఘన చరిత్ర కలిగిన దిగ్గజ జట్టు ఈసారి సెమీస్‌లో బెంబేలెత్తింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ముంబై 44 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోరు. గతంలో 1977లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై 42 పరుగులకే ఆలౌటయింది. అయితే ముంబైతో పాటు కర్ణాటక బ్యాట్స్‌మెన్ కూడా తడబడటంతో... తొలి రోజు బుధవారం ఏకంగా 22 వికెట్లు పడ్డాయి. చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 60.2 ఓవర్లలో 202 పరుగులకు ఆలౌటయింది. రాబిన్ ఉతప్ప (68) టాప్ స్కోరర్. కరుణ్ నాయర్ (49), మనీష్ పాండే (34) రాణించారు. ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీశాడు. డిఫెండింగ్ చాంపియన్‌ను తక్కువ స్కోరుకు ఆలౌట్ చేసిన ఆనందం ముంబైకి మిగల్లేదు.
ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఊహించని విధంగా కేవలం 15.3 ఓవర్లలో 44 పరుగులకు ఆలౌటయింది. శ్రేయస్ అయ్యర్ (15), సూర్యకుమార్ (12) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. కర్ణాటక కెప్టెన్ వినయ్ కుమార్ (6/20) సంచలన పేస్ బౌలింగ్‌తో ముంబైని వణికించాడు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక 5 ఓవర్లలో 2 వికెట్లకు 10 పరుగులు చేసింది. ప్రస్తుతం కర్ణాటక ఓవరాల్‌గా 168 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తమిళనాడు 192/3
కోల్‌కతా: ఈడెన్‌గార్డెన్స్‌లో మహారాష్ట్రతో జరుగుతున్న సెమీస్‌లో తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 87 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసింది. విజయ్ శంకర్ (56 బ్యాటింగ్), దినేశ్ కార్తీక్ (48 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ముంబై బెంబేలు
Published Thu, Feb 26 2015 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM
Advertisement