
న్యూఢిల్లీ: ఎనిమిదేళ్ల క్రితం భారత్ తరఫున అండర్–19 ప్రపంచ కప్ ఆడిన కుర్రాడు ఇప్పుడు అమెరికా సీనియర్ క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ముంబైకి చెందిన 27 ఏళ్ల సౌరభ్ నేత్రవల్కర్‌కు ఈ అరుదైన అవకాశం లభించింది. 2023 వన్డే వరల్డ్ కప్‌నకు అర్హత టోర్నీ అయిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ డివిజన్ 3 పోటీల్లో అతను యూఎస్‌ఏకు నాయకుడిగా వ్యవహరిస్తాడు. నేత్రవల్కర్ ఇప్పటికే అమెరికాకు మూడు లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లలో కెప్టెన్సీ చేశాడు. ఇటీవలి వరకు కెప్టెన్‌గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన రంజీ క్రికెటర్ ఇబ్రహీం ఖలీల్‌ను తప్పించి అతని స్థానంలో మరో భారత ఆటగాడినే కెప్టెన్‌గా నియమించింది.
2010 అండర్–19 ప్రపంచ కప్‌లో సభ్యుడిగా ఉన్న ఈ లెఫ్టార్మ్ పేస్ బౌలర్ ముంబై తరఫున 2013లో ఏకైక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు. అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదివేందుకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత ‘ఒరాకిల్’ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తూ మరోసారి క్రికెట్ వైపు ఆకర్షితుడయ్యాడు. నిబంధనల ప్రకారం అమెరికా తరఫున ఆడేందుకు అర్హత సాధించిన అనంతరం సత్తా చాటి జట్టులోకి ఎంపికైన సౌరభ్ ఇప్పుడు కెప్టెన్‌గా మారడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment