ఫిక్సింగ్ స్కాంలో బొపారా!
లండన్: భారత సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ రవి బొపారాపై మ్యాచ్ ఫిక్సింగ్ నీడలు కమ్ముకుంటున్నాయి. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో వెలుగుచూసిన ఫిక్సింగ్ ఉదంతం తర్వాత అతన్ని ఐసీసీ అవినీతి నిరోధక మరియు భద్రతా యూనిట్ అధికారులు రెండు గంటల పాటు విచారించారని సమాచారం. 12 నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో పాటు మూడేళ్లకు సంబంధించిన మొబైల్ ఫోన్ కాల్స్ డేటాను ఇవ్వాలని క్రికెటర్‌ను కోరారు. అయితే బిజీ షెడ్యూల్ వల్ల బొపారా వాటిని సకాలంలో సమర్పించలేకపోయాడు.
బీపీఎల్‌లో చిట్టగాంగ్ కింగ్స్ ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహించిన బొపారా... ఆ తర్వాత దక్షిణాఫ్రికాలో జరిగిన ఓ టి20 టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లాడు. అయితే ఇలాంటి అంశాలను తెలుసుకునేందుకు సంబంధించిన ఐసీసీ నియమావళిపై సంతకం చేయకపోవడంతో బొపారాపై మరో వారం రోజుల్లో వేటు పడే అవకాశాలున్నాయి.