
ఇంగ్లండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్! గత రెండు పర్యటనల చేదు అనుభవాలను చెరిపేసేందుకు ఆటగాళ్లకు ఓ చక్కటి అవకాశమైతే... టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రికి ఎంతో కీలకం. పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించాక అతడు ఎదుర్కొంటున్న కఠిన సవాల్ ఇదే. కెప్టెన్ విరాట్ కోహ్లి మద్దతుతో జట్టుపై తనదైన ప్రభావం చూపుతున్న రవిశాస్త్రి ముందున్నది పెద్ద పరీక్షే. ఈ నేపథ్యంలో సిరీస్‌పై అతడు తన దృక్పథాన్ని వెల్లడించాడు.
చెమ్స్‌ఫోర్డ్: తమ ముందున్న సవాల్ ప్రత్యర్థిని ఓడించడమేనని, ప్రస్తుత పర్యటనలో ఫలితాలకు వాతావరణం, పిచ్‌లను కారణంగా చూపబోమని అంటున్నాడు టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా గొప్పగా ఆడి, ఉత్తమ జట్టుగా నిలవడాన్ని గర్వంగా భావిస్తామని పేర్కొన్నాడు. సుదీర్ఘ టెస్టు సిరీస్‌కు ముందు ఏకైక సన్నాహక మ్యాచ్ ఏర్పాట్లు సరిగా లేకపోవడం పెద్దగా పట్టించుకోవాల్సిన అంశం కాదన్నాడు. ‘ఇలాంటి విషయాల్లో మీ దేశంలో నేను ప్రశ్నించను. మా దేశంలో మీరు ప్రశ్నించొద్దు అనేది నా సిద్ధాంతం. నేను గ్రౌండ్స్‌మెన్‌తో మాట్లాడా. దీనిని ఇంతటితో మర్చిపొమ్మని చెప్పా’ అని బుధవారం మీడియా సమావేశంలో వివరించాడు. అతడు ఇంకా ఏం అన్నాడంటే...!
పచ్చిక తొలగించొద్దన్నా...
‘ఎస్సెక్స్‌తో మ్యాచ్‌కు పిచ్‌పై చిక్కటి పచ్చిక ఉంది. మీరు కోరితే దానిని తొలగిస్తాం అని గ్రౌండ్స్‌మెన్ చెప్పారు. అయినా నేను వద్దని కచ్చితంగా చెప్పా. మీరు ఇచ్చే దానిపై మేం ఆడటానికి సిద్ధంగా ఉన్నాం. మా దేశానికి వచ్చినప్పుడు మీరు కూడా పిచ్‌ల గురించి ప్రశ్నించొద్దని సూచించా. సన్నాహక మ్యాచ్‌లో ఒక రోజు కుదింపుపై మంగళవారం ప్రాక్టీస్ సందర్భంగా నిర్ణయం తీసుకున్నాం. రెండు రోజుల మ్యాచ్ ఆడటమూ మాకు సంతోషకరమే. అయితే ఎస్సెక్స్ స్టేడియం అధికారులు తాము టికెట్లు విక్రయించిన సంగతితో పాటు అన్ని వివరాలు తెలిపారు. దీంతో మూడు రోజుల మ్యాచ్ ఆడేందుకు ఒప్పుకొన్నాం. వాతావరణం, ఇతర కారణాలతో సన్నాహక మ్యాచ్‌లో ఒక రోజు పోయినా మొదటి టెస్టు జరిగే బర్మింగ్‌హామ్‌లో మా ప్రాక్టీస్‌కు మూడు రోజుల సమయం దొరుకుతుంది. ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో ఒక సెషన్ అయినా సాధన చేయాలన్నది మా అసలు ఉద్దేశం. ఇక్కడ మేం ఒక రోజు అదనంగా ఉన్నా ప్రయోజనం ఏమీ లేదు. పైగా నాలుగు రోజులు ఆడితే... బర్మింగ్‌హామ్‌కు ప్రయాణం కారణంగా ఒక రోజును కోల్పోయేవాళ్లం. ఈ వ్యవధిని మొదటి టెస్టు జరిగే చోట గడిపితే మాకు వేదికతో పాటు పరిస్థితులపై అవగాహన వస్తుంది’ అని పేరొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment