India vs England 1st Test: India 39/1 At Stumps On Day 4, Need 381 More Runs To Win - Sakshi
Sakshi News home page

చెన్నైలో గెలుస్తారా, మనోళ్లు నిలుస్తారా!

Published Tue, Feb 9 2021 5:03 AM | Last Updated on Tue, Feb 9 2021 9:34 AM

India 39 For 1 at stumps in run chase before Ashwin steals the show - Sakshi

రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌

టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఒక జట్టు నాలుగో ఇన్నింగ్స్‌లో సాధించిన అత్యధిక పరుగుల ఛేదన 418 పరుగులు... ఇప్పుడు భారత్‌ ముందు దానికంటే మరో రెండు పరుగుల ఎక్కువ విజయ లక్ష్యం నిలిచింది. అందుబాటులో కనీసం 90 ఓవర్లు ఉండగా, తొమ్మిది వికెట్లు ఉన్నాయి. కొన్నాళ్లుగా టీమిండియా పఠిస్తున్న దూకుడు మంత్రంతో ఈ లక్ష్యాన్ని సాధించే సాహసం చేస్తుందా లేక ఆత్మ రక్షణ ధోరణిలో ఆడి ‘డ్రా’గా ముగిస్తే చాలని ప్రయత్నిస్తుందా అనేది ఆసక్తికరం.

ఎన్నో ఏళ్లలో భారత జట్టుకు సొంతగడ్డపై ఎదురుకాని పరిస్థితి ఇది! భారత్‌ను ఈ స్థితిలో పడేసిన ఇంగ్లండ్‌ మాత్రం తొమ్మిది వికెట్లు తీయడమే లక్ష్యంగా గెలుపుపై గురి పెట్టింది. అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్, గింగిరాలు తిరుగుతూ వెళ్లిన కొన్ని బంతులు పర్యాటక జట్టుకు విజయంపై ఆశలు రేపుతున్నాయి. తమ బౌలర్ల ప్రతిభతో మ్యాచ్‌ నాలుగో రోజు ఏకంగా 241 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కినా, ఫాలోఆన్‌ ఇవ్వకుండా రూట్‌ సేన రెండో ఇన్నింగ్స్‌ ఆడగా... భారత్‌ మెరుగైన బౌలింగ్‌తో కట్టడి చేయగలిగింది. ఆరు వికెట్లతో అశ్విన్‌ ఇందులో కీలకపాత్ర పోషించడం విశేషం.

చెన్నై: భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు ఉత్కంఠభరిత ఘట్టానికి చేరింది. 420 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోయి 39 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (12) పెవిలియన్‌ చేరగా, ప్రస్తుతం శుబ్‌మన్‌ గిల్‌ (15 బ్యాటింగ్‌), పుజారా (12 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. చివరిరోజు భారత్‌ విజయం కోసం మరో 381 పరుగులు చేయాల్సి ఉంది. ఇంగ్లండ్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులకు ఆలౌటైంది.

జో రూట్‌ (32 బంతుల్లో 40; 7 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, రవిచంద్రన్‌ అశ్విన్‌ (6/61) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. అంతకుముందు భారత్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులకు ఆలౌటైంది. సోమవారం మరో 80 పరుగులు జోడించిన టీమిండియా చివరి 4 వికెట్లు కోల్పోయింది. ఫలితంగా ఇంగ్లండ్‌కు 241 పరుగుల ఆధిక్యం లభించింది. వాషింగ్టన్‌ సుందర్‌ (138 బంతుల్లో 85 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి చక్కటి ప్రదర్శన కనబర్చాడు.  

80 పరుగులు...4 వికెట్లు...
సొంత మైదానంలో సుందర్, అశ్విన్‌ (91 బంతుల్లో 31; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ల భాగస్వామ్యం భారత జట్టుకు కాస్త చెప్పుకోదగ్గ స్కోరును అందించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 257/6తో సోమవారం ఆటను కొనసాగిస్తూ వీరిద్దరు చకచకా పరుగులు జోడించారు. ఈ క్రమంలో 82 బంతుల్లో సుందర్‌ టెస్టుల్లో వరుసగా రెండో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఎట్టకేలకు ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించాక అశ్విన్‌ను అవుట్‌ చేసి లీచ్‌ ఈ జంటను విడగొట్టాడు. ఆ తర్వాత ఒకవైపు సుందర్‌ ధాటిగా ఆడినా... మరో ఎండ్‌లో నదీమ్‌ (0), ఇషాంత్‌ (4), బుమ్రా (0) నిలబడలేకపోవడంతో ఇంగ్లండ్‌ స్కోరుకు చాలా దూరంలో భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది.  

రూట్‌ మినహా...
రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడి తక్కువ సమయంలో ఎక్కువ పరుగులు జోడిద్దామని భావించిన ఇంగ్లండ్‌ ఆ ప్రయత్నంలో కొంత వరకే సఫలమైంది. భారీ ఆధిక్యంతో ఆట ప్రారంభించిన ఆ జట్టుకు తొలి బంతికే షాక్‌ తగిలింది. అశ్విన్‌ చక్కటి బౌలింగ్‌ను ఆడలేక రోరీ బర్న్స్‌ (0) స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లో రూట్‌ మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. సిబ్లీ (16)ని కూడా అశ్విన్‌ పెవిలియన్‌ పంపించగా... లారెన్స్‌ (18)ను అవుట్‌ చేసి ఇషాంత్‌ కెరీర్‌లో 300వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు రూట్‌ మాత్రం అశ్విన్, నదీమ్‌ ఓవర్లలో రెండేసి ఫోర్లు బాది ధాటిని ప్రదర్శించాడు. అయితే స్టోక్స్‌ (7) విఫలం కాగా, రూట్‌ను బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. అనంతరం కొన్ని ఆకట్టుకునే షాట్లు ఆడిన ఒలీ పోప్‌ (32 బంతుల్లో 28; 3 ఫోర్లు) నదీమ్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. అంతే?... ఈ వికెట్‌తో ఇంగ్లండ్‌ దృక్పథం మారిపోయింది. అప్పటి వరకు జోరు ప్రదర్శించిన జట్టు రక్షణాత్మకంగా ఆడింది. వేగంగా పరుగులు చేయడంకంటే సాధ్యమైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడాలనే భావనతో ఉన్నట్లు కనిపించింది. ఈ దశలో డిక్లేర్‌ చేయడంకంటే ఆలౌట్‌ అయ్యే వరకు ఆడేందుకు నిశ్చయించుకుంది. ఈ క్రమంలో డామ్‌ బెస్‌ (55 బంతుల్లో 25; 3 ఫోర్లు), జోస్‌ బట్లర్‌ (40 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కొన్ని పరుగులు జోడించారు. అయితే అశ్విన్‌ చక్కటి బౌలింగ్‌తో చివరి నాలుగు వికెట్లలో మూడు పడగొట్టడంతో ఇంగ్లండ్‌ ఆలౌట్‌ అయింది.

రోహిత్‌ మళ్లీ...
భారీ లక్ష్యంతో ఆట ప్రారంభించిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ఆర్చర్‌ ఓవర్లో వరుసగా ఫోర్‌ కొట్టి జోరు మీదున్నట్లు కనిపించిన రోహిత్‌ ఎక్కువసేపు నిలబడలేదు. లీచ్‌ వేసిన అద్భుత బంతి అతని స్టంప్స్‌ను ఎగరగొట్టింది. ఈ దశలో గిల్, పుజారా జాగ్రత్తగా ఆడి మరో ప్రమాదం లేకుండా రోజును ముగించగలిగారు.

స్కోరు వివరాలు
ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 578, భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) బట్లర్‌ (బి) ఆర్చర్‌ 6; గిల్‌ (సి) అండర్సన్‌ (బి) ఆర్చర్‌ 29; పుజారా (సి) బర్న్స్‌ (బి) బెస్‌ 73; కోహ్లి (సి) పోప్‌ (బి) బెస్‌ 11; రహానే (సి) రూట్‌ (బి) బెస్‌ 1; పంత్‌ (సి) లీచ్‌ (బి) బెస్‌ 91; సుందర్‌ (నాటౌట్‌) 85; అశ్విన్‌ (సి) బట్లర్‌ (బి) లీచ్‌ 31; నదీమ్‌ (సి) స్టోక్స్‌ (బి) లీచ్‌ 0; ఇషాంత్‌ (సి) పోప్‌ (బి) అండర్సన్‌ 4; బుమ్రా (సి) స్టోక్స్‌ (బి) అండర్సన్‌ 0; ఎక్స్‌ట్రాలు 6,
మొత్తం (95.5 ఓవర్లలో ఆలౌట్‌) 337.
వికెట్ల పతనం: 1–19, 2–44, 3–71, 4–73, 5–192, 6–225, 7–305, 8–312, 9–323, 10–337. బౌలింగ్‌: అండర్సన్‌ 16.5–5–46–2, ఆర్చర్‌ 21–3–75–2, స్టోక్స్‌ 6–1–16–0, లీచ్‌ 24–5–105–2, బెస్‌ 26–5–76–4, రూట్‌ 2–0–14–0.

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (సి) రహానే (బి) అశ్విన్‌ 0; సిబ్లీ (సి) పుజారా (బి) అశ్విన్‌ 16; లారెన్స్‌ (ఎల్బీ) (బి) ఇషాంత్‌ 18; రూట్‌ (ఎల్బీ) (బి) బుమ్రా 40; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) అశ్విన్‌ 7; పోప్‌ (సి) రోహిత్‌ (బి) నదీమ్‌ 28; బట్లర్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) నదీమ్‌ 24; బెస్‌ (ఎల్బీ) (బి) అశ్విన్‌ 25; ఆర్చర్‌ (బి) అశ్విన్‌ 5; లీచ్‌ (నాటౌట్‌) 8; అండర్సన్‌ (సి అండ్‌ బి) అశ్విన్‌ 0; ఎక్స్‌ట్రాలు 7,
మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్‌) 178.
వికెట్ల పతనం: 1–0, 2–32, 3–58, 4–71, 5–101, 6–130, 7–165, 8–167, 9–178, 10–178.
బౌలింగ్‌: అశ్విన్‌ 17.3–2–61–6, నదీమ్‌ 15–2–66–2, ఇషాంత్‌ 7–1–24–1, బుమ్రా 6–0–26–1, సుందర్‌ 1–0–1–0.  

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: రోహిత్‌ (బి) లీచ్‌ 12, గిల్‌ (బ్యాటింగ్‌) 15, పుజారా (బ్యాటింగ్‌) 12, మొత్తం (13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 39.  
వికెట్ల పతనం: 1–25.
బౌలింగ్‌: ఆర్చర్‌ 3–2–13–0, లీచ్‌ 6–1–21–1, అండర్సన్‌ 2–1–2–0, బెస్‌ 2–0–3–0.

అశ్విన్, రోహిత్‌ క్లీన్‌ బౌల్డ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement