రిషభ్ పంత్ పుజారా
ఇది భారత గడ్డపై జరుగుతున్న టెస్టు. కానీ... ఇంగ్లండ్‌లో సాగుతున్నట్లుగా అనిపిస్తోంది! రోజు గడిచే కొద్దీ ప్రత్యర్థి పైచేయి పెరిగిపోతోంది. మూడో రోజైతే ఆఖరి వరుసదాకా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్... బౌలింగ్‌కు దిగేసరికి మన సేనను ఆఖరి వరుస బ్యాట్స్‌మెన్ దాకా ఔట్ చేసుకొచ్చింది. పంత్, పుజారా మెరిసినా భారత్‌ను ఇంకా ఫాలోఆన్ ప్రమాదం వెంటాడుతోంది. నాలుగోరోజు వాషింగ్టన్ సుందర్, అశ్విన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడితే తప్ప భారత్ గట్టెక్కే పరిస్థితి కనిపించడంలేదు.
చెన్నై: ఒకటి... రెండు... మూడు... ఇన్ని రోజులైనా టెస్టు ఇంగ్లండ్ చేతిలోనే ఉంది. ప్రత్యర్థి చేతిలో టీమిండియా బౌలింగ్, బ్యాటింగ్ తేలిపోతోంది. తొలి టెస్టులో భారత్ కష్టాల నావతో ఏటికి ఎదురీదుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 74 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 321 పరుగుల దూరంలో ఉంది. చతేశ్వర్ పుజారా (143 బంతుల్లో 73; 11 ఫోర్లు) కొంతవరకు గోడ కట్టేసినా... యువ సంచలనం రిషభ్ పంత్ (88 బంతుల్లో 91; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) ధనాధన్ మెరిపించినా... అది ఊరడించింది. కానీ ఒడ్డున పడేసేదాకా సాగలేదు. ఇంగ్లండ్ స్పిన్నర్ డామ్ బెస్ (4/55) చెపాక్‌లో తిప్పేశాడు. పేసర్ ఆర్చర్ (2/52) భారత ఓపెనింగ్‌ను చెదరగొట్టాడు. ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కాలంటే భారత్ మిగిలున్న 4 వికెట్లతో 122 పరుగులు చేయాలి. వాషింగ్టన్ సుందర్ (33 బ్యాటింగ్), అశ్విన్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఇంకొన్ని చేసి ఆలౌటైంది
అంతకుముందు ఇంగ్లండ్ బ్యాటింగ్ మూడో రోజు కూడా సాగింది. ఓవర్‌నైట్ స్కోరు 555/8తో ఆదివారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్ మరో 23 పరుగులు చేసి 578 పరుగుల వద్ద ఆలౌటైంది. బెస్ (34; 6 ఫోర్లు)ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేయగా... అండర్సన్ (1)ను అశ్విన్ బౌల్డ్ చేశాడు. దీంతో బుమ్రా, అశ్విన్‌లకు చెరో 3 వికెట్లు దక్కాయి.
ఆరంభంపై ఆర్చర్ పిడుగు
ప్రత్యర్థి ఆధిక్యం చూస్తే కొండంత... దీంతో భారత్‌కు శుభారంభం చాలా అవసరం. కానీ జోఫ్రా ఆర్చర్ ఆ అవకాశం ఇవ్వనేలేదు. తన రెండో ఓవర్లోనే (ఇన్నింగ్స్ 4వ) రోహిత్ శర్మ (9 బంతుల్లో 6; 1 ఫోర్)ను బోల్తా కొట్టించాడు. లెంత్ బాల్‌ను డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించగా... అది బ్యాట్ అంచును తాకి నేరుగా కీపర్ బట్లర్ చేతుల్లో పడింది. పూజారా క్రీజులోకి రాగా... మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ చూడచక్కని స్ట్రోక్ ప్లేతో బంతుల్ని బౌండరీలకు తరలించాడు. కానీ ఆర్చర్... గిల్ ఆటను ఎంతోసేపు సాగనివ్వలేదు. అతను అడిన షాట్‌ను మిడాన్‌లో అండర్సన్ డైవ్ చేస్తూ అందుకోవడంతో గిల్ (28 బంతుల్లో 29; 5 ఫోర్లు) దూకుడు ముగిసింది. 44 పరుగులకే భారత ఓపెనర్లిద్దరూ ఔటయ్యారు.
స్పిన్ ఉచ్చులో కోహ్లి, రహానే
పూజారాకు కెప్టెన్ కోహ్లి జతయ్యాడు. జట్టు స్కోరు 50 పరుగులు దాటింది. ఆ వెంటే 59/2 స్కోరు వద్ద లంచ్‌కు వెళ్లింది. తర్వాత ఆట మొదలైన కాసేపటికే భారత టాప్ బ్యాట్స్‌మెన్, ఇప్పుడున్న జట్టులో అనుభవజ్ఞులైన కెప్టెన్ కోహ్లి (48 బంతుల్లో 11), వైస్ కెప్టెన్ రహానే (6 బంతుల్లో 1) స్పిన్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఆఫ్ స్పిన్నర్ బెస్ తన 5వ ఓవర్లో (ఇన్నింగ్స్ 25వ) కోహ్లిని, మరుసటి ఓవర్లో రహానేని పెవిలియన్ చేర్చాడు. అప్పటికి జట్టు స్కోరు 73/4. దీంతో ఇన్నింగ్స్ వెన్నెముక విరిగినంత పనైంది. ఈ దశలో రిషభ్ పంత్ వచ్చాడు.
సిక్సర్ల పంత్...
జట్టు స్కోరు చూసినా... రాలిన వికెట్లు (టాప్–4 బ్యాట్స్‌మెన్) చూసినా... భారత్ పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ రిషభ్ పంత్ తన శైలి మార్చుకోలేదు. షరామామూలుగా ధనాధన్ ఆట ఆడేశాడు. కానీ జాగ్రత్త వహించాడు. స్పిన్‌తో చెలరేగుతున్న బెస్‌ను గౌరవించాడు. మరో స్పిన్నర్ లీచ్‌ను చితగ్గొట్టాడు. రిషభ్ పంత్ కొట్టిన ఐదు సిక్సర్లలు లీచ్ బౌలింగ్‌లోనే బాదేయడం విశేషం. దీంతో 32వ ఓవర్లో వంద పరుగులకు చేరిన భారత్ 150 మార్క్‌ను 39.5వ ఓవర్లోనే అందుకుంది. చిత్రంగా ఈ 40వ ఓవర్లోనే కుదరుగా ఆడుతున్న పుజారా (106 బంతుల్లో; 7 ఫోర్లతో), ధాటిగా సాగుతున్న రిషభ్ (40 బంతుల్లో; 4 ఫోర్లు, 4 సిక్సర్లతో) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో సెషన్‌లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. 154/4 వద్ద భారత్ టీ విరామానికెళ్లింది. ఆఖరి సెషన్లోనూ వీరిద్దరి భాగస్వామ్యం పరుగులతో సాగిపోయింది. పూజారా కూడా గేర్ మార్చి చకచకా పరుగులు జతచేశాడు.
ఆదుకున్న భాగస్వామ్యం
పంత్–పుజారా పార్ట్‌నర్‌షిప్ సాఫీగా సాగిపోవడంతో 121 బంతుల్లోనే 100 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించింది. వడివడిగా జట్టు 200 పరుగులు చేరే క్రమంలో పుజారాను బెస్ బోల్తా కొట్టించి మరో దెబ్బ తీశాడు. దీంతో ఐదో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం వాషింగ్టన్ సుందర్ జతవ్వగా... 52వ ఓవర్లో పంత్ సిక్సర్‌తో జట్టు స్కోరు 200 మైలురాయిని దాటింది. ధాటిగా ఆడుతున్న రిషభ్ పంత్ సెంచరీకి సమీపించాడు.
కానీ బెస్ ఈ దూకుడుకూ కళ్లెం వేసి మళ్లీ భారత్‌ను కష్టాల్లోకి నెట్టేశాడు. పంత్ ఆడిన లాఫ్టెడ్ షాట్ డీప్ కవర్‌లో గాల్లోకి లేవగా లీచ్ అందుకున్నాడు. 225 స్కోరు వద్ద ఆరో వికెట్‌గా పంత్ నిష్క్రమించాడు. ఈ 30 రోజుల్లోనే గత మూడు టెస్టుల వ్యవధిలో 3 సెంచరీల్ని పంత్ చేజార్చుకున్నాడు. సిడ్నీలో 97 పరుగులు చేసిన పంత్ బ్రిస్బేన్‌లో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తర్వాత సుందర్, అశ్విన్ ప్రత్యర్థి బౌలర్లకు ఇంకో అవకాశం ఇవ్వకుండా 18 ఓవర్లు ఓపిగ్గా ఆడుకున్నారు.
స్కోరు వివరాలు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 578; భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 6; శుబ్‌మన్ గిల్ (సి) అండర్సన్ (బి) ఆర్చర్ 29; పుజారా (సి) బర్న్స్ (బి) బెస్ 73; విరాట్ కోహ్లి (సి) పోప్ (బి) బెస్ 11; రహానే (సి) రూట్ (బి) బెస్ 1; రిషభ్ పంత్ (సి) లీచ్ (బి) బెస్ 91; వాషింగ్టన్ సుందర్ (బ్యాటింగ్) 33; అశ్విన్ (బ్యాటింగ్) 8; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (74 ఓవర్లలో 6 వికెట్లకు) 257.
వికెట్ల పతనం: 1–19, 2–44, 3–71, 4–73, 5–192, 6–225. బౌలింగ్: అండర్సన్ 11–3–34–0, ఆర్చర్ 16–3–52–2, స్టోక్స్ 6–1–16–0, లీచ్ 17–2–94–0, బెస్ 23–5–55–4, రూట్ 1–0–1–0.
మా వికెట్లు పడినా... పిచ్ అయితే బ్యాటింగ్‌కే అనుకూలంగా ఉంది. కాబట్టి నాలుగో రోజు అశ్విన్, వాషింగ్టన్ సుందర్ క్రీజులో నిలబడితే మా పరిస్థితి మెరుగవుతుంది. కీలకమైన భాగస్వామ్యం నమోదైతే మ్యాచ్ చేజారకుండా చూసుకోవచ్చు.
–పూజారా, భారత బ్యాట్స్‌మన్
భారత కెప్టెన్ కోహ్లిని అవుట్ చేసిన బెస్‌కు సహచరుల అభినందన
Comments
Please login to add a commentAdd a comment