వృద్ధిమాన్ సాహా(ఫైల్‌ఫొటో)
కోల్‌కతా:రాబోవు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగుతున్న వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా తన బ్యాటింగ్ స్థానంపై స్పందించాడు. తన కొత్త ఫ్రాంచైజీ హైదరాబాద్ కోరితే ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ సేవలు అందించేందుకు సిద్దం ఉన్నట్లు తెలిపాడు. కేవలం టాపార్డర్‌లోనే కాకుండా, లోయర్ ఆర్డర్‌లో కూడా బ్యాటింగ్ చేస్తానని ఈ సందర్భంగా సాహా స్పష్టం చేశాడు.
'నేను ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నా. జట్టు మేనేజ్‌మెంట్ ఆదేశాల మేరకు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్దంగా ఉన్నా. పొట్టి ఫార్మాట్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడాల్సిన అవసరం ఉంటుంది. అందుచేత ఫలానా స్థానంలో బ్యాటింగ్ చేస్తాననడం సరైంది కాదు. నాకు అప్పజెప్పే బాధ్యతల్ని నిర్వర్తించడానికి రెడీగా ఉన్నా. ఆ క్రమంలో ఎక్కడ బ్యాటింగ్ చేయాల్సిన వచ్చినా అది సమస్యగా భావించను' అని సాహా తెలిపాడు.
మరొకవైపు ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో వారి దేశంలో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌పై కూడా సాహా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో కఠినమైన సవాల్ ఉంటుందని పేర్కొన్న సాహా.. అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఆడితే అది కచ్చితంగా మన జట్టుకు లాభిస్తుందన్నాడు. కాగా, ఇంగ్లండ్‌లో వికెట్ల వెనుక కీపింగ్ చేయడం అంత ఈజీ కాదని సాహా పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment