4.4 ఓవర్లు.. 4 పరుగులు.. 6 వికెట్లు
మిర్పూర్: స్టువార్ట్ బిన్నీ రికార్డ్ బౌలింగ్ తో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్ ను 2-0తో గెల్చుకుంది. రైనా సేన నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 17.4 ఓవర్లలో 58 పరుగులకు ఆలౌటయింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ను 41 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 25.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటయింది. రైనా 27 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
స్వల్ప లక్ష్యాన్ని చేరుకునేందుకు బరిలోకి దిగిన బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. మొహిత్ శర్మ, స్టువార్ట్ బిన్నీ ధాటికి బంగ్లా బ్యాట్స్మెన్ నిలబడలేకపోయారు. ముఖ్యంగా బిన్నీ తన పదునైన బౌలింగ్ తో అత్యుత్తమ గణంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు తీసిన భారతీయ బౌలర్ గా రికార్డు సృష్టించాడు.
స్టువార్ట్ బిన్నీ 4.4 ఓవర్లలో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మొహిత్ శర్మ 4 వికెట్లు నేలకూల్చాడు. బంగ్లా ఆటగాళ్లలో మిథున్ అలీ(26), ముష్ఫికర్ రహీం(11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. నలుగురు డకౌటయ్యారు. స్టువార్ట్ బిన్నీ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్నాడు.