పంత్‌ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. లక్నో మూల్యం చెల్లించింది! | IPL 2025: Pant Last Over Stumping Blunder Costs LSG The Match Against DC | Sakshi
Sakshi News home page

పంత్‌ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే.. లక్నో మూల్యం చెల్లించింది!

Published Tue, Mar 25 2025 5:37 PM | Last Updated on Tue, Mar 25 2025 5:58 PM

IPL 2025: Pant Last Over Stumping Blunder Costs LSG The Match Against DC

Photo Courtesy: BCCI/IPL

పొట్టి ఫార్మాట్‌ క్రికెట్‌లో మ్యాచ్‌ల ఫలితం  ఎప్పుడూ అనూహ్యంగా ఉంటుంది. ఢిల్లీ కేపిటల్స్- లక్నో సూపర్ జెయింట్స్ మధ్య  సోమవారం విశాఖపట్నం వేదికగా జరిగిన మ్యాచ్ ఈ విషయాన్ని మరో మారు స్పష్టమైంది.

సత్తా చాటిన శార్దూల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)- 2025లో భాగంగా.. ఈ మ్యాచ్ ప్రారంభం నుంచి అదే ధోరణిలో జరిగింది. భారత్ జట్టులో స్థానం కోల్పోయి, వేలంలో అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో ఉన్న అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్... మీడియం పేసర్ మొహ్సిన్ ఖాన్ గాయం కారణంగా తప్పుకోవడంతో జట్టులోకి వచ్చి.. సత్తా చాటడం ఒక ఎత్తు.

ఇక ఇంగ్లండ్ కౌంటీ లో ఎసెక్స్ జట్టు తరపున ఆడాలని నిర్ణయించుకుని ఫ్లయిట్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్న అతడు.. అనూహ్యంగా దక్కిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. మొదటి ఓవర్‌లో ఢిల్లీ ఓపెనర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ మరియు అభిషేక్ పోరెల్ ల వికెట్లు పడగొట్టాడు.

దిక్కుతోచని స్థితి
మరో వైపు ఎడమచేతి వాటం స్పిన్నర్ ఎం సిద్ధార్థ్ కు సమీర్ రిజ్వి ని అవుట్ చేయడంతో ఢిల్లీ రెండో ఓవర్ లోనే 7 పరుగులకు  మూడు వికెట్లు కోల్పోయింది. 209 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ ఒక దశలో  66  పరుగులకే  ఐదు వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరింది.  

ఈ దశలో ఉత్తర్ ప్రదేశ్ అల్ రౌండర్ విప్రజ్ నిగమ్ 15 బంతుల్లో 39 పరుగులు చేసి ఢిల్లీకి  కొంత ఉపశమనాన్నిచ్చాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా బ్యాటింగ్ కి వచ్చిన ఢిల్లీ బ్యాట్స్మన్ అశుతోష్ శర్మ  తాను ఎదుర్కొన్న తొలి 20 బంతుల్లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు.

ఇక ఢిల్లీకి లక్ష్య సాధన దాదాపు కష్టమన్న దశలో అశుతోష్ శర్మ పూనకం వచ్చిన రీతిలో బ్యాటింగ్ చేసి తదుపరి 11 బంతుల్లో 46 పరుగులు సాధించాడు. అందులో  ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి. దీనితో ఓటమి చేరువులో ఉన్న ఢిల్లీ కి  ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఒక వికెట్ తేడాతో అద్భుత విజయాన్ని అందించాడు.

లక్నోను ఆదుకున్న మార్ష్, పూరన్
గత సీజన్ లో తరచుగా పవర్ ప్లేలో వెనుకబడి ఉన్నట్లు కనిపించిన లక్నో ఈ సీజన్ లో దానిని సరిదిద్దే  ప్రయత్నం చేసింది. జట్టులోని ఇద్దరు విదేశీ ఆటగాళ్ల కు ఆ బాధ్యతను అప్పగించింది. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్, వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్‌ నికోలస్ పూరన్ రెండవ వికెట్‌కు కేవలం 42 బంతుల్లో 87 పరుగులు జోడించారు. 

పూరన్ 30 బంతుల్లో ఆరు ఫోర్లు, ఏడు సిక్సర్లు లతో 75 పరుగులు చేయగా, మార్ష్ 36 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్ల తో 72 పరుగులు సాధించాడు.  

ఫలితంగా లక్నో జట్టు 250 పరుగులు పైగా సాధిస్తుందని భావిస్తున్న తరుణంలో  ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ మరియు భారత్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వరుసగా వికెట్లు తీసి లక్నోని దెబ్బతీశారు. లక్నో 14 నుంచి 19 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే జోడించి ఆరు వికెట్లు కోల్పోయింది.

ఈ దశలో  లక్నో 200 పరుగులు దాటడమే కష్టమని భావిస్తున్న తరుణంలో డేవిడ్ మిల్లర్ ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో  మీడియం పేసర్ మోహిత్‌ శర్మ రెండు సిక్సర్లు కొట్టడంతో స్కోరు 209కి చేరింది. నిజానికి ఢిల్లీ స్కోరు 204/9 వద్ద ఉన్న సమయంలో మోహిత్‌ శర్మను స్టంపౌట్‌ చేసే అవకాశాన్ని పంత్‌ మిస్‌ చేశాడు. ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో బాల్‌ మోహిత్‌ ప్యాడ్లను తాకినట్లుగా అనిపించింది.

పంత్‌ చేసిన ఆ ఒక్క తప్పు వల్లే
అయితే, అంతలోనే అతడు పరుగు కోసం క్రీజును వీడగా కీపర్‌ పంత్‌ స్టంపింగ్‌ చేయకుండా.. రివ్యూకు వెళ్లాడు. ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే, రీప్లేలో బంతి స్టంప్స్‌ను మిస్‌ అవుతోందని థర్డ్‌ అంపైర్‌ నుంచి నిర్ణయం వెలువడగా.. సేఫ్‌ అయ్యాడు మోహిత్‌. 

నిజానికి అతడిని స్టంపౌట్‌ చేస్తే.. పదో వికెట్‌ కోల్పోయి అప్పుడే ఢిల్లీ కథ ముగిసేది. అదే ఓవర్లో మూడో బంతికి అశుతోష్‌ సిక్సర్‌ బాది మ్యాచ్‌ను ముగించాడు. అలా నాటకీయ పరిణామాలతో ఢిల్లీ ఈ మ్యాచ్ లో విజయం సాధించడం విశేషం. 
 

 చదవండి: ‘గిల్‌ ఒక్కడే ఏమీ చేయలేడు.. మేమంతా ఉంటేనే ఏదైనా సాధ్యం’

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement