క్వార్టర్ ఫైనల్లో భారత్
అర్జెంటీనాపై 2-1తో విజయం
రియో డీ జనీరో : రియో ఒలింపిక్స్ పురుషుల హాకీ లో భారత జట్టు మరో రెండు లీగ్ మ్యాచ్‌లు మిగిలుండగానే క్వార్టర్ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. మంగళవారం జరిగిన గ్రూప్-బి మ్యాచ్‌లో భారత జట్టు అర్జెంటీనాపై 2-1తేడాతో గెలుపొందింది. భారత్ తరపున చింగ్లెన్‌సానా సింగ్, కోథాజిత్ సింగ్ చెరో గోల్ చేయగా.. గోల్ కీపర్ శ్రీజేశ్ అర్జెంటీనా పెనాల్టీ కార్నర్‌లకు అడ్డుగోడగా నిలిచాడు. ఈ విజయం తర్వాత భారత జట్టు ఆరు పాయింట్లతో మూడోస్థానంలో ఉంది. మ్యాచ్ ఆరంభంలో భారత జట్టు చాలా దూకుడును ప్రదర్శించింది. ఆట ఏడో నిమిషంలోనే తొలి పెనాల్టీ కార్నర్ అవకాశం వచ్చింది.
అయితే.. రూపిందర్ సింగ్ ఫ్లిక్‌ను అర్జెంటీనా గోల్ కీపర్ అడ్డుకున్నాడు. అయితే తర్వాత నిమిషంలోనే చెంగ్లెన్‌సానా వేగంగా స్పందించటంతో భారత్‌కు తొలిగోల్ దక్కింది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించాయి. మూడో క్వార్టర్ ముగిసే సమయంలో కోథాజిత్ రెండో గోల్‌తో భారత్ ఆధిక్యాన్ని పెంచాడు. అయితే ఆట నాలుగో క్వార్టర్‌లో ప్రత్యర్థికి నాలుగు పెనాల్టీ కార్నర్ అవకాశాలొచ్చాయి. అర్జెంటీనా డ్రాగ్ ఫ్లిక్ స్పెషలిస్ట్ గంజాలో పీల్లెట్ మొదటి కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. అయితే.. మిగిలిన మూడింటినీ భారత గోల్‌కీపర్ శ్రీజేశ్ విజయవంతంగా అడ్డుకున్నాడు. తదుపరి మ్యాచులలో నెదర్లాండ్స్, కెనడాలతో భారత్ తలపడనుంది.
బ్రిటన్ చేతిలో ఓడిన మహిళలు
మహిళల హాకీలో భారత జట్టు బ్రిటన్ చేతిలో 0-3 తేడాతో ఓటమిపాలైంది. బ్రిటన్ తరఫున జిష్లే అంస్లీ, నికోలా వైట్, అలెక్సా డాన్సర్ ఒక్కో గోల్ చేశారు.
రోయింగ్: భోకనాళ్ ఔట్
పురుషుల సింగిల్ స్కల్స్ ఈవెంట్లో భారత రోయర్ దత్త బబన్ భోకనాళ్ క్వార్టర్ ఫైనల్‌లోనే వెనుదిరిగాడు. హీట్స్‌లో 7.21.67 టైమింగ్‌తో 2వేల మీటర్ల రేసును పూర్తి చేసిన భోకనాళ్.. క్వార్టర్స్‌లో 6.53.52 టైమింగ్ సాధించినా నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
షూటింగ్: హీనా సిద్ధు అవుట్
రియోలో భారత షూటర్ల వైఫల్యం కొనసాగుతోంది. మహిళల 25మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హీనా సిద్ధు క్వాలిఫయింగ్ దశలోనే నిష్ర్కమించింది. 600కు గానూ 576 పాయింట్లు సాధించి.. మొత్తం 40 మంది పోటీదారుల్లో 20వ స్థానంలో నిలిచింది.
ఆర్చరీ: ప్రి క్వార్టర్స్‌లో అతాను
పురుషుల వ్యక్తిగత ఆర్చరీలో అతాను దాస్ ప్రి క్వార్టర్స్‌కు చేరాడు. క్యూబా ఆర్చర్ పెరేజ్‌తో జరిగిన రెండోరౌండ్‌లో అతాను 6-4తో గెలుపొందాడు. తొలి రౌండ్‌లో 6-0తో నేపాల్‌కు చెందిన జీత్‌బహదూర్‌పై నెగ్గాడు. శుక్రవారం జరిగే ప్రి క్వార్టర్ ఫైనల్లో కొరియన్ ఆర్చర్ లీ సుంగ్యున్‌తో అతాను తలపడనున్నాడు.
షూటింగ్
పురుషుల 50 మీటర్ల పిస్టల్
ప్రకాశ్ నంజప్ప, జీతూరాయ్
సాయంత్రం 5.30 నుంచి (ఫైనల్ రాత్రి 8.30కు)
ఆర్చరీ
మహిళల వ్యక్తిగత ఈవెంట్ (రౌండ్ 64)
బొంబేలా దేవ x లారెన్స్ బాల్డఫ్ (ఆస్ట్రేలియా)
సాయంత్రం 6.10 నుంచి
దీపికా కుమార x క్రిస్టిన్ సెబువా (జార్జియా)
గురువారం తెల్లవారుజామున 1.30 నుంచి
జూడో
పురుషుల 90 కేజీల విభాగం
అవతార్ సింగ x పొపోల్ రెసెంగా
(శరణార్థుల బృందం)
రాత్రి 7.20 నుంచి
మహిళల హాకీ
భారత x ఆస్ట్రేలియా
రాత్రి 7.30 నుంచి
బాక్సింగ్
పురుషుల లైట్‌వెయిట్ (64 కేజీల విభాగం)
మనోజ్ కుమార్ x ఎవల్దస్ పెట్రాస్‌కస్
(లిథువేనియా)
గురువారం తెల్లవారుజామున 3గంటలకు