
లండన్: ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బ్రిటిష్ పాప్ స్టార్ రాబీ విలియమ్సన్ తన గానంతో అలరించనున్నాడు. ఈ నెల 14న మాస్కోలోని లుజ్నికి మైదానంలో రష్యా–సౌదీ అరేబియా మధ్య తొలి మ్యాచ్‌తో విశ్వ సమరానికి తెరలేవనుంది. దీనికి కొద్దిగా ముందు రాబీ... రష్యన్ గాయని ఐదా గార్ఫులినాతో కలిసి పాడనున్నాడు. 44 ఏళ్ల రాబీ ‘ఏంజెల్స్’ ఆల్బమ్‌తో ప్రఖ్యాతిగాంచాడు. రెండేళ్ల క్రితం అతడి పాట ‘పార్టీ లైక్ ఏ రష్యన్’ వివాదాస్పదమైంది.
ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉద్దేశించినట్లు ఉందని అభ్యంతరాలు వచ్చాయి. వీటిని అప్పట్లోనే రాబీ ఖండించాడు. అయితే, తాజా అవకాశాన్ని అతడు తన చిన్ననాటి కలగా, మర్చిపోలేని జ్ఞాపకంగా అభివర్ణించాడు. మరోవైపు బ్రెజిల్ మాజీ దిగ్గజం రొనాల్డోపై చిత్రీకరించిన ‘ఓ ఫినామినో’ వీడియోనూ ప్రపంచ కప్ ప్రారంభం సందర్భంగా ప్రదర్శించనున్నారు.