
రాబిన్ ఊతప్ప భారీ సెంచరీ
హుబ్బాలీ:టీమిండియా మాజీ ఓపెనర్, కర్ణాటక ఆటగాడు రాబిన్ ఊతప్ప రంజీ ట్రోఫీ మ్యాచ్ లో చెలరేగిపోయాడు. గ్రూప్-ఏలో భాగంగా సోమవారం ఢిల్లీతో ఆరంభమైన మ్యాచ్ లో తనదైన శైలిలో విరుచుకుపడిన ఊతప్ప(148) భారీ సెంచరీ నమోదు చేశాడు. ఊతప్ప 16 ఫోర్లు, 6 సిక్సర్లతో ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఢిల్లీ పార్ట్ టైమ్ బౌలర్ ధ్రువ్ షోరే వేసిన ఒక ఓవర్ లో 32 పరుగులు చేసి సెంచరీ నమోదు చేశాడు. మరో ఆటగాడు మయాంక్ అగర్వాల్(118;209 బంతుల్లో 19 ఫోర్లు) శతకం సాధించడంతో కర్ణాటక భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. టాస్ గెలిచిన ఢిల్లీ తొలుత బ్యాటింగ్ చేయడానికి కర్ణాటకను ఆహ్వానించింది.
దీంతో బ్యాటింగ్ చేపట్టిన కర్ణాటకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆర్ సమర్థ్(17) తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరి నిరాశపరిచాడు. అనంతరం అగర్వాల్ -ఊతప్పల జోడీ ఢిల్లీ బౌలర్లకు చుక్కులు చూపెట్టింది. తమ వికెట్లను కాపాడుకుంటూనే ఢిల్లీని చీల్చి చెండాడింది. ఈ జంట రెండో వికెట్ కు 236 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక ఆద్యంతం ఆధిపత్యం కొనసాగించింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక 90 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో సూర్యల్ రెండు వికెట్లు తీయగా, సంగ్వాన్ కు ఒక వికెట్ దక్కింది.