అభిమానులారా నన్ను క్షమించండీ!
రియో ఒలింపిక్స్కు ముందు విశ్రాంతి కోసం కెనడా మేజర్ ఈవెంట్ టొరంటో మాస్టర్స్ టైటిల్ నుంచి టాప్ సీడెడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైదొలిగారు. ఇందులో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ పెదరర్ కూడా ఉన్నాడు. విశ్రాంతి తీసుకున్నా గాయాల నుంచి ఫెదరర్ కోలుకోలేదు. దీంతో తాను రియోలో తాను పాల్గొనడం లేదని 17 గ్రాండ్ స్లామ్ విజేత ఫెదరర్ తన వ్యక్తిగత ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎఫ్బీ పోస్ట్లో పేర్కొన్నాడు.
'అభిమానులారా ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా బాధగా ఉంది. రియో ఒలింపిక్స్ లో స్విట్జర్లాండ్ కు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాను. డాక్టర్లు, ఇతర వ్యక్తిగత సిబ్బందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఫిబ్రవరిలో సర్జరీ చేయించుకున్నాను. అయితే మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. రియోతో పాటు దాదాపు ఈ ఏడాది ఏ టోర్నీలోనూ పాల్గొనను. వచ్చే ఏడాది నూతన ఉత్సాహంతో రంగంలోకి దిగుతాను. కెరీర్ లో తక్కువ గాయాలతో కేవలం కొన్ని టోర్నమెంట్లకు మాత్రమే దూరమయ్యాను, ఎందుకంటే.. టెన్నిస్పై నాకు ఉన్న ప్రేమ అలాంటిది. అభిమానుల ఆశీర్వాదంతో పూర్తిగా కోలుకుని 2017లో రీ ఎంట్రీ ఇస్తాను' అని స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఈ విషయాలను ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు.