ఫెడరర్‌ శుభారంభం | Roger Federer Sheds Nike Swoosh in Favor of Uniqlo, Wins Match | Sakshi
Sakshi News home page

ఫెడరర్‌ శుభారంభం

Published Tue, Jul 3 2018 12:27 AM | Last Updated on Tue, Jul 3 2018 12:27 AM

Roger Federer Sheds Nike Swoosh in Favor of Uniqlo, Wins Match - Sakshi

లండన్‌: తొమ్మిదో సారి వింబుల్డన్‌ టైటిల్‌ సాధించే లక్ష్యంతో బరిలోకి దిగిన దిగ్గజ ఆటగాడు, టాప్‌ సీడ్‌ రోజర్‌ ఫెడరర్‌ రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టాడు. టోర్నీ తొలి రోజు సోమవారం జరిగిన మొదటి రౌండ్‌ మ్యాచ్‌లో ఫెడరర్‌ 6–1, 6–3, 6–4తో డ్యుసాన్‌ లజోవిక్‌ (సెర్బియా)ను చిత్తు చేశాడు. కేవలం 79 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో వరల్డ్‌ నంబర్‌ 2 ముందు లజోవిక్‌ నిలవలేకపోయాడు. మరో మ్యాచ్‌లో మూడో సీడ్‌ మారిన్‌ సిలిచ్‌ (క్రొయేషియా) కూడా విజయం సాధించి ముందంజ వేశాడు. సిలిచ్‌ 6–1, 6–4, 6–4తో నిషియోకా (జపాన్‌)ను ఓడించాడు. మహిళల విభాగంలో తొలి రోజే పెద్ద సంచలనం నమోదైంది. నాలుగో సీడ్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ రన్నరప్‌ స్లోన్‌ స్టీఫెన్స్‌ (అమెరికా) మొదటి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టింది. క్రొయేషియాకు చెందిన డోనా వెకిక్‌ 6–1, 6–3తో స్టీఫెన్స్‌ను చిత్తుగా ఓడించింది. రెండో సీడ్‌ కరోలినా వోజ్నియాకి (డెన్మార్క్‌) 6–0, 6–3తో వర్వరా లెప్‌చెంకో (అమెరికా)ను చిత్తు చేసి రెండో రౌండ్‌లోకి అడుగు పెట్టింది.  మాజీ చాంపియన్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా) 7–5, 6–3తో అరాంటా రుస్‌ (నెదర్లాండ్స్‌)ను ఓడించి ముందంజ వేసింది. వీనస్‌ విలియమ్స్‌ (అమెరికా) 6–7, 6–2, 6–1తో జొహన్నా లార్సన్‌ (స్వీడన్‌)పై గెలిచి తర్వాతి రౌండ్‌లోకి ప్రవేశించింది.  భారత ఆటగాడు యూకీ బాంబ్రీ కథ తొలి రౌండ్‌లోనే ముగిసింది. హోరాహోరీగా సాగిన పోరులో థామస్‌ ఫాబియానో (ఇటలీ) 2–6, 6–3, 6–3, 6–2తో బాంబ్రీని ఓడించాడు. 2 గంటల 39 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో యూకీ తొలి సెట్‌ గెలుచుకోగలిగినా... ఆ తర్వాత చేతులెత్తేశాడు.  

ఏడాదికి రూ. 200 కోట్లు!  
రెండు దశాబ్దాలుగా ప్రఖ్యాత ‘నైకీ’ సంస్థతో కొనసాగించిన అనుబంధాన్ని ఫెడరర్‌ ముగించాడు. కొత్తగా జపాన్‌కు చెందిన ‘యునిక్లో’తో ఒప్పందం కుదుర్చుకున్న అతను, తొలిసారి వింబుల్డన్‌ మ్యాచ్‌లో ఆ సంస్థకు చెందిన కిట్‌తో బరిలోకి దిగాడు. పదేళ్ల కాలానికి ఈ ఒప్పందం విలువ సుమారు 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 2 వేల కోట్లు) వరకు ఉందని సమాచారం. నైకీ ఇస్తున్నదానితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ కావడం విశేషం. కాంట్రాక్ట్‌లో ఉన్న నిబంధన ప్రకారం ఫెడరర్‌ ఆటగాడిగా రిటైర్‌ అయినా అతనికి అంతే డబ్బు లభిస్తుంది. అయితే ఫెడరర్‌ సొంత బ్రాండ్‌ ‘ఆర్‌ఎఫ్‌’ హక్కులు మాత్రం ఇంకా నైకీ వద్దనే ఉన్నాయి. అయితే తన పేరుతో ఉన్న బ్రాండ్‌ కాబట్టి ఇప్పుడు కాకపోయినా... మరి కొద్ది రోజుల తర్వాత దాని హక్కులు తనకే దక్కుతాయని ఈ స్విస్‌ స్టార్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement