రోహిత్‌కు క్రిక్‌ఇన్ఫో అవార్డు
న్యూఢిల్లీ: భారత ఓపెనర్ రోహిత్ శర్మ గతేడాది శ్రీలంకపై ప్రపంచ వన్డే క్రికెట్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ అద్భుత ప్రదర్శన ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ఉత్తమ వన్డే ఇన్నింగ్స్‌గా ఎంపికైంది. వన్డే, టెస్టు, టి20 ఫార్మాట్‌లో బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఈ అవార్డులను ప్రదానం చేయనుంది. రోహిత్ 2013లో కూడా ఉత్తమ వన్డే ఇన్నింగ్స్ అవార్డు అందుకున్నాడు.
అలాగే శ్రీలంక పేసర్ లసిత్ మలింగ ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన (పాక్‌పై 5/56)లో విజేతగా నిలిచాడు. టెస్టు ఫార్మాట్‌లో ఉత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసిన ఆసీస్ పేసర్ మిషెల్ జాన్సన్ (దక్షిణాఫ్రికాపై 7/68) ఈ అవార్డును అందుకోనున్నాడు. ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్‌గా బ్రెండన్ మెకల్లమ్ (భారత్‌పై 302) ట్రిపుల్ సెంచరీ నిలిచింది. అలాగే టి20లో ఉత్తమ ప్రదర్శన (శ్రీలంకపై 116 నాటౌట్)తో ఆకట్టుకున్న అలెక్స్ హేల్స్, ఉత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసినందుకు హెరాత్ (కివీస్‌పై 5/3) ఎంపికయ్యారు.