నా టాలెంట్‌పై నమ్మకముంది
న్యూఢిల్లీ: నైపుణ్యానికేమీ కొదవ లేకున్నా... క్రికెట్‌లో అత్యుత్తమ ఫార్మాట్‌గా పేరున్న టెస్టుల్లో మాత్రం ఇప్పటికీ చోటు దక్కించుకోలేకపోతున్నాడు రోహిత్ శర్మ. ఆరేళ్ల క్రితం భారత జట్టు తరఫున అరంగే ట్రం చేసిన ఈ ముంబై ఆటగాడు ఇప్పటికి 102 వన్డేలు ఆడాడు. వందకు పైగా వన్డేలు ఆడినా ఒక్క టెస్టు కూడా ఆడని తొలి క్రికెటర్‌గా రోహిత్ పేరు తెచ్చుకున్నాడు. అటు వన్డే జట్టులోనూ తన స్థానాన్ని పటిష్ట పరుచుకోలేక పోయాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో, కరీబియన్ పర్యటనలోనూ రోహిత్ కొత్త అవతారం ఎత్తాడు.
కెప్టెన్ ధోని తనపై ఉంచిన అపార నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఓపెనర్‌గా బరిలోకి దిగి దుమ్ము రేపాడు. తాను విలువైన ఆటగాడినేనని ఎట్టకేలకు నిరూపించుకున్నాడు. దీంతో ఈసారి టెస్టుల్లో బెర్త్ దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నాడు. 2010లో దక్షిణాఫ్రికాతో నాగ్‌పూర్ టెస్టుకు ముందు గాయంతో ఆటకు దూరం కావడంతో అవకాశం చిక్కినట్టే చిక్కి దూరమైంది. ఆ తర్వాత రెండు సార్లు జట్టుకు ఎంపికైనా బరిలోకి దిగే చాన్స్ దక్కలేదు. కానీ నవంబర్‌లో ఇక్కడికి రానున్న వెస్టిండీస్‌తో ఆడే భారత టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కుతుందని చెబుతున్న ఈ 26 ఏళ్ల స్టార్ ఆటగాడు పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే...
నమ్మకంగా ఉన్నాను: నేను పూర్తి విశ్వాసంతో ఉన్నాను. మరోసారి టెస్టు పిలుపు వస్తుందని ఆశిస్తున్నాను. నా అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్నాను. ఇదంతా నా చేతుల్లో లేకున్నా నా పని మాత్రం శాయశక్తులా ఆడి జట్టు విజయం కోసం పాటుపడడమే. నా టాలెంట్ గురించి తెలుసు: ఇప్పటిదాకా నా ఆటతీరుపై నేను సంతృప్తిగానే ఉన్నాను. వంద శాతం నా నైపుణ్యాన్ని మైదానంలో ప్రదర్శించడం లేదనే విమర్శలు లెక్కచేయను. వెనక్కి తిరిగి చూసుకోవాలనుకోవడం లేదు. నా ఆటతీరుపై శ్రమిస్తున్నా. ఇలాగే ముందుకెళ్లాలని భావిస్తున్నాను.
ప్రస్తుత దశ బాగుంది: గత నాలుగు నెలలు అద్భుతంగా గడిచిపోయాయి. నా ఫామ్‌పై చాలా సంతోషంగా ఉన్నాను. నా బ్యాటింగ్‌ను ఆస్వాదించాను. దాదాపు 25 మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్‌ను ప్రారంభించా. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కొంతకాలంగా ధావన్, నేను మంచి ఓపెనింగ్ జోడిగా పేరు తెచ్చుకున్నాం. మంచి శుభారంభాలను ఇచ్చాం. జట్టు విజయాలకు ఇది ఉపయోగపడింది.
ఆ పర్యటనతో లాభం: త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటించనుంది. ఇటీవలే నేను భారత ‘ఎ’ జట్టు తరఫున అక్కడ ఆడాను. ఈ అనుభవం ఆ పర్యటనకు ఎంతగానో దోహదపడుతుంది. బాగా ఆడడమే కాకుండా అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాం. అయితే పేస్, బౌన్సీ పిచ్‌లు మాకు ఎదురుకాలేదు.