ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ
ఇండోర్ : ఐపీఎల్ భాగంగా ఇండోర్‌లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించి.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం చేసుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రెండు సిక్సర్లు బాదిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన మొదటి భారతీయ బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు.
17వ ఓవర్‌లో కింగ్స్ పంజాబ్ బౌలర్ ముజీబ్ ఉర్ రెహమాన్ వేసిన బంతిని రోహిత్ శర్మ సిక్సర్‌గా మలిచాడు. తద్వారా పొట్టి ఫార్మాట్‌లోని అన్ని టోర్నమెంట్లలో కలిపి 301 సిక్సర్లు బాది ఈ ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక సిక్సర్ల వీరుల జాబితాలో క్రిస్‌గేల్(844) ప్రథమ స్థానంలో ఉండగా.. కిరన్ పొలార్డ్(525), బ్రెండన్ మెకల్లమ్(445), డ్వేన్ స్మిత్(367), షేన్ వాట్సన్(357), డేవిడ్ వార్నర్ (319), రోహిత్ శర్మ (301) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.
ఐపీఎల్‌లో కూడా..
ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రెండుసార్లు ట్రోఫీ అందుకున్న రోహిత్.. జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 168 ఐపీఎల్ మ్యాచుల్లో రోహిత్ శర్మ 4427 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో రోహిత్ అత్యధిక స్కోరు 109. ఇప్పటివరకు రోహిత్ శర్మ ఈ సీజన్‌లో 11 సిక్సులు, 21 బౌండరీలు నమోదు చేశాడు.
ఐపీఎల్ చరిత్రలో కూడా క్రిస్‌గేల్(290) తర్వాత రోహిత్ 183 సిక్సర్లతో రెండో స్థానంలో నిలిచాడు. ధోని, సురేశ్ రైనా 180, డివిల్లియర్స్ 179 సిక్సర్లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అదే విధంగా అంతర్జాతీయ టీ20ల్లో 79 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ 1852 పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలతో పాటు, 14 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో రోహిత్ అత్యధిక స్కోరు 118.
Comments
Please login to add a commentAdd a comment