రోహిత్ శర్మకు షాక్
ముంబై: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు షాక్ తగిలింది. అంపైర్‌తో వాగ్వాదానికి దిగినందుకు అతడికి జరిమానా విధించారు. సోమవారం రైజింగ్ పుణే సూపర్ జెయింట్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో అంపైర్ ఎస్. రవితో వాదానికి దిగాడు. పుణే బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ ఇవ్వకపోవడంతో రోహిత్‌కు కోపం వచ్చింది. నేరుగా అంపైర్ దగ్గరకు వెళ్లి ఎందుకు వైడ్ ఇవ్వలేదని గొడవపడ్డాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింనందుకు రోహిత్ శర్మపై చర్య తీసుకున్నారు. అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించినట్టు ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. రోహిత్ కూడా తప్పు ఒప్పుకున్నాడు.
ఐపీఎల్-10లో రెండోసారి అంపైర్ నిర్ణయాన్ని అతడు వ్యతిరేకించాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించి మందలింపుకు గురయ్యాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుటైన రోహిత్ శర్మ.. అంపైర్ సీకే నందన్ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంపైర్ వైపు బ్యాటు చూపిస్తూ అసంతృప్తిగా మైదానం వీడాడు.