రోహిత్ శర్మ అస్సలు కేకలు వేయలేదు!
ఎంపైర్ తో వాగ్వాదానికి దిగిన తమ జట్టు కెప్టెన్ ను ముంబై ఇండియన్స్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వెనకేసుకొచ్చాడు. ఎంపైర్‌తో రోహిత్ శర్మ తప్పుగా ప్రవర్తించలేదని, నిబంధనలకు ఎంపైర్‌కు వివరించడానికే అతను ప్రయత్నించాడని చెప్పుకొచ్చాడు. రోహిత్ ఎంపైర్‌తో వాదన పెట్టుకోలేదని, కేకలు వేయలేదన్నాడు. వాంఖడే స్టేడియంలో సోమవారం పుణేతో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఎంపైర్‌తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. పుణే బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ వేసిన బంతి వైడ్ వెళ్లినా అంపైర్ ఇవ్వకపోవడంతో రోహిత్‌కు కోపం వచ్చింది. నేరుగా అంపైర్ దగ్గరకు వెళ్లి ఎందుకు వైడ్ ఇవ్వలేదంటూ వాదనకు దిగాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించింనందుకు రోహిత్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు.
మ్యాచ్‌లో జరిగిన ఈ ఘటనపై హర్భజన్ స్పందిస్తూ.. ‘ ఆ బంతి మాత్రం చాలా దూరంగా వెళ్లింది. నిజాయితీగా చెప్పాలంటే.. అది వైడా, కాదా అన్నది నాకు తెలియదు. బ్యాట్‌మన్ రెండు కాళ్లు కదిలించినప్పుడు బౌలర్‌కు మార్జిన్ ఇవ్వవచ్చు. కానీ రోహిత్ ఒక కాలు మాత్రమే కదిలించాడు. ఆ ప్రకారం ఇది వైడ్ కావాలి. కానీ ఎంపైర్ నిర్ణయం ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఆటలో ఎవరు మెరుగ్గా ఆడితే వారే గెలుస్తారు’ అని చెప్పాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌తో ముంబైపై పుణేతో మూడు పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. బేన్ స్టోక్ వేసిన 19వ ఓవర్ మ్యాచ్ గతిని మార్చి.. పుణే వైపు మొగ్గేలా చేసిందని, ఆఖరి వరకూ పోరాటం చేసినా చివరి ఓవర్‌లో రోహిత్ ఔటవ్వడంతో విజయావకాశాలు దెబ్బతిన్నాయని అన్నారు.