మాంచెస్టర్: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశ ముగిసి నాకౌట్‌కు తెరలేచింది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌కు చేరడంతో ఆయా జట్లు తమ తమ వ్యూహ-ప్రతి వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. ఇప్పుడు ఏయే జట్లు తుది పోరుకు అర్హత సాధిస్తాయి అనే దానిపై ప్రధానంగా చర్చ జరుగుతుంటే, వరల్డ్‌కప్ టాప్ స్కోరర్‌గా ఎవరు నిలుస్తారనే దానిపై కూడా దాదాపు అంతే స్థాయిలో చర్చ జరుగుతోంది. లీగ్ దశ ముగిసే సరికి భారత ఓపెనర్ రోహిత్ శర్మ 647 పరుగులతో ‘టాప్’ లేపితే, ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 638 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ ఆడే జట్లూ సెమీస్ బరిలో ఉండటంతో ఎవరు టాప్ స్కోరర్‌గా నిలుస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.( ఇక్కడ చదవండి: ‘సెమీస్‌లో అతనిదే కీలక పాత్ర’)
ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో భారత మాజీ క్రికెటర్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2003 వరల్డ్‌కప్‌లో సచిన్ చేసిన పరుగులు 673. ఆ మెగా టోర్నీలో భారత్ ఫైనల్‌కు చేరే క్రమంలో సచిన్ చేసిన పరుగులివి. దాదాపు 16 ఏళ్ల క్రితం సచిన్ సాధించిన ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగుల సాధించిన రికార్డే ఇంకా పదిలంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో మాథ్యూ హేడెన్ ఉన్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఆసీస్ మాజీ ఆటగాడు మాథ్యూ హేడెన్ 659 పరుగులు చేశాడు. దాంతో ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన జాబితాలో సచిన్, హేడెన్‌లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఇప్పుడు వారి రికార్డు బద్ధలు కావడం ఖాయంగా కనబడుతోంది. రోహిత్, వార్నర్‌ల రూపంలో సచిన్, హేడెన్‌ల రికార్డుకు ముప్పు పొంచి ఉంది. అయితే మంగళవారం న్యూజిలాండ్‌తో జరుగనున్న తొలి సెమీ ఫైనల్లో రోహిత్ శర్మ 27 పరుగులు చేస్తే చాలు సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడు. అదే సమయంలో ఒక వరల్డ్‌కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ టాప్‌లో నిలుస్తాడు.( ఇక్కడ చదవండి: ఆ రెండు జట్లే ఫైనల్లో తలపడేవి: పీటర్సన్)
ఇక డేవిడ్ వార్నర్ కూడా రోహిత్ వెనుకాల ఉండటంతో వరల్డ్‌కప్ ముగిసే సరికి టాప్ ప్లేస్‌ను ఎవరు ఆక‍్రమిస్తారనేది క్రీడాభిమానులకు ఆసక్తికరంగా మారింది. కచ్చితంగా రోహిత్-వార్నర్‌ల్లో ఒకరు ఉంటారనేది సగటు క్రీడాభిమాని అభిప్రాయం. ఇదిలా ఉంచితే, ఈ వరల్డ్‌కప్‌లో ఐదుగురు ఆటగాళ్లు ఐదు వందల మార్కును చేరడం ఇక్కడ విశేషం. రోహిత్, వార్నర్‌లతో పాటు షకీబుల్ హసన్, అరోన్ ఫించ్, జో రూట్‌లు ఐదు వందల పరుగుల క్లబ్‌లో చేరిపోయారు. అయితే షకీబుల్ హసన్(606) నుంచి ఇక పోటీ లేదు. బంగ్లాదేశ్ లీగ్ దశలోనే తమ ఆటను ముగించడంతో షకీబుల్ ఇక రేసులో లేడు. మిగిలిన ఆటగాళ్లలో అరోన్ ఫించ్(ఆస్ట్రేలియా), జోరూట్(ఇంగ్లండ్)ల నుంచే రోహిత్-వార్నర్‌లకు పోటీ ఉంది. అది కూడా రోహిత్, వార్నర్‌లు మిగతా మ్యాచ్‌ల్లో విఫలమైన పక్షంలో మాత్రమే ఫించ్, జోరూట్‌లు పోటీలో నిలుస్తారు. ఒకవేళ రోహిత్, వార్నర్‌లు అదే ఫామ్‌ను కొనసాగిస్తే మాత్రం వీరిద్దరీ మధ్యే టాప్ ప్లేస్ ఉంటుంది. ఈ మెగా టోర్నీలో ఐదు సెంచరీలతో రోహిత్ మంచి జోష్ మీద ఉండగా, వార్నర్ మూడు సెంచరీలు సాధించాడు. వీరు అదే జోష్‌ను కొనసాగిస్తే దశాబ్ద కాలానికి పైగా దాచుకున్న తమ తమ దేశాల క్రికెటర్ల రికార్డులు తెరమరుగవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment