
టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన రోహిత్.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన స్పెషల్-5 బ్యాట్స్‌మెన్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలతో రోహిత్ శర్మ 648 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్‌లో అద్భుతంగా రాణించిన హిట్‌మ్యాన్ 81 సగటుతో పరుగులు చేశాడు. అయితే, సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడంతో రోహిత్ కృషి వృధా అయింది.
తాజాగా ఐసీసీ.. తన ట్విటర్ పేజీలో టాప్-5 స్పెషల్ బ్యాట్స్‌మెన్ జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో రోహిత్ మొదటిస్థానంలో ఉండగా.. రెండో స్థానంలో డేవిడ్ వార్నర్, మూడోస్థానంలో షకీబుల్ హసన్, నాలుగో స్థానంలో కేన్ విలియమ్సన్, ఐదో స్థానంలో జోయి రూట్ ఉన్నారు. ఇక పరుగుల ప్రకారం చూసుకుంటే.. రోహిత్ కన్నా ఒక్క పరుగు తక్కువ చేసిన డేవిడ్ వార్నర్ 647 పరుగులతో, 71.89 సగటుతో రెండో స్థానాన్ని సాధించాడు. బంగ్లాదేశ్ లీగ్ దశలోనే తన పోరాటాన్ని ముగించినప్పటికీ.. ఆ జట్టు తరఫున అద్భుతంగా ఆడిన షకీబుల్ 86.57 సగటుతో 606 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ 578 పరుగులు చేయగా.. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోయి రూట్ 556 పరుగులు చేశాడు.