
టి20ల్లో ఉత్తమ ఇన్నింగ్స్ రోహిత్‌దే...
ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డులు
న్యూఢిల్లీ: భారత జట్టు ఓపెనర్ రోహిత్ శర్మ వరుసగా మూడోసారి ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో అవార్డును సాధించాడు. 2013, 2014ల్లో వన్డేల్లో చేసిన డ బుల్ శతకాలు ఆ ఫార్మాట్‌లో ఉత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచాయి. ఈసారి దక్షిణాఫ్రికాతో జరిగిన టి20లో తను సెంచరీ (106) చేయడంతో పొట్టి ఫార్మాట్‌లో ఉత్తమ ఇన్నింగ్స్ అవార్డును దక్కించుకున్నాడు. ఇయాన్ చాపెల్, వాల్ష్, జాన్ రైట్, జయవర్ధనే, అగార్కర్, మంజ్రేకర్, రస్సెల్ ఆర్నాల్డ్, మార్క్ నికోలస్‌లతో కూడిన ప్యానెల్ క్రిక్‌ఇన్ఫో అవార్డులను ప్రకటించింది.
న్యూజిలాండ్‌ను ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చిన మాజీ ఆటగాడు బ్రెండన్ మెకల్లమ్‌కు ‘కెప్టెన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు దక్కింది. ఈ విభాగంలో అవార్డును ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. అలాగే ‘ఉత్తమ టెస్టు బౌలింగ్’ స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), ‘ఉత్తమ టెస్టు ఇన్నింగ్స్’ కేన్ విలియమ్సన్ (కివీస్), ‘ఉత్తమ వన్డే ఇన్నింగ్స్’ డి విలియర్స్ (దక్షిణాఫ్రికా), ‘ఉత్తమ వన్డే బౌలింగ్’ టిమ్ సౌతీ (కివీస్), ‘ఉత్తమ టి20 బౌలింగ్’ డేవిడ్ వీస్ (దక్షిణాఫ్రికా), ‘ఉత్తమ అరంగేట్రం’ ముస్తాఫిజుర్ రహమాన్ (బంగ్లాదేశ్)లకు దక్కాయి.