
రాస్ టేలర్ డబుల్ సెంచరీ
డునెడిన్: రాస్ టేలర్ (319 బంతుల్లో 217 నాటౌట్; 23 ఫోర్లు) కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ నమోదు చేయడంతో... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. బుధవారం రెండో రోజు కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను 153.1 ఓవర్లలో 9 వికెట్లకు 609 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన విండీస్ ఆట ముగిసే సమయానికి 24 ఓవర్లలో 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. డారెన్ బ్రేవో (37 బ్యాటింగ్), శామ్యూల్స్ (14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. బోల్ట్, సౌతీకి చెరో వికెట్ దక్కింది. అంతకుముందు 367/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన కివీస్ ఆరంభంలోనే మెకల్లమ్ (113) వికెట్‌ను కోల్పోయింది.
దీంతో టేలర్, మెకల్లమ్ మధ్య నాలుగో వికెట్‌కు 195 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. విండీస్‌పై కివీస్‌కు ఇది రికార్డు భాగస్వామ్యం. తర్వాత వచ్చిన అండర్సన్ (0) విఫలమైనా... వాట్లింగ్ (41) నిలకడగా ఆడాడు. టేలర్‌కు చక్కని సహకారం అందిస్తూ ఆరో వికెట్‌కు 84 పరుగులు జోడించి అవుటయ్యాడు. చివర్లో సౌతీ (2) నిరాశపర్చినా... సోధి (35), వాగ్నేర్ (37)లు మాత్రం సమర్థంగా ఆడారు. ఈ ఇద్దరి అండతో చెలరేగిన టేలర్ 295 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ తరఫున ‘డబుల్’ సాధించిన 13వ బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కాడు.