
'ఎప్పటికైనా రోహిత్ రికార్డ్ నేనే బద్దలుకొడతా'
వన్డే క్రికెట్లో సెంచరీలకు, డబుల్ సెంచరీలకు, రికార్డులకు మారుపేరైన జట్టు టీమిండియా. ఇదివరకే వన్డే మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మలు అద్భుత ద్విశతకాలను సాధించారు. వీరితో పాటు డబుల్ సాధించిన మరో విధ్వంసక క్రికెటర్ మార్టిన్ గప్టిల్. అయితే అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును రోహిత్ (264 పరుగులు) తన పేరిట లిఖించుకున్నాడు. కానీ రోహిత్ పేరిట ఉన్న ఈ రికార్డును అధిగమిస్తానని చాలెంజ్ విసిరాడు న్యూజిలాండ్ క్రికెటర్ గప్టిల్.
వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల జాబితాలో రోహిత్ తర్వాతి స్థానం గప్టిల్ (237 పరుగులు)దేనన్న విషయం తెలిసిందే. 264 అంటేనే అసాధ్యమైన పని తనకు తెలుసునని అయితే ఏదో ఒకరోజు కచ్చితంగా తానే రోహిత్ రికార్డును బద్ధలుకొడతానని గప్టిల్ ధీమా వ్యక్తం చేశాడు. గతంలో 189, 180 పరుగుల భారీ ఇన్నింగ్స్‌లతో తాను డబుల్ సెంచరీలు చేజార్చుకున్నానని, అయితే 237 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆ కోరిక నెరవేరిందన్నాడు గప్టిల్. అయితే రోహిత్ (264) రికార్డుపేనే తాను దృష్టి పెట్టానని, ఎప్పటికైనా ఆ అరుదైన ఫీట్‌ను అధిగమించి అద్భుత రికార్డును తన ఖాతాలో వేసుకోవాలని ఈ కివీస్ స్టార్ క్రికెటర్ ఉందన్నాడు.