టేలర్ సెంచరీ.. కివీస్ ప్రతీకార విజయం | Ross Taylor ton gives win to New Zealand against South Africa | Sakshi
Sakshi News home page

టేలర్ సెంచరీ.. కివీస్ ప్రతీకార విజయం

Published Wed, Feb 22 2017 11:48 AM | Last Updated on Tue, Sep 5 2017 4:21 AM

టేలర్ సెంచరీ.. కివీస్ ప్రతీకార విజయం

టేలర్ సెంచరీ.. కివీస్ ప్రతీకార విజయం

క్రిస్ట్ చర్చ్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్‌ ప్రతీకారం విజయం సాధించింది. తొలి వన్డేలో ఓటమికి రెండో వన్డేలో గెలుపుతో బదులిచ్చింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన రెండో వన్డేలో సఫారీ జట్టుపై న్యూజిలాండ్ 6 పరుగుల తేడాతో గట్టెక్కింది. సిరీస్ ను 1-1తో సమం చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన విలియమ్సన్ సేన రాస్ టేలర్ అజేయ శతకం చేయడంతో(102 నాటౌట్, 110 బంతుల్లో 8 పోర్లు) నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 289 పరుగులు చేసింది. కెప్టెన్ విలియమ్సన్ (69, 71 బంతుల్లో 6 ఫోర్లు), నీషమ్(71 నాటౌట్, 57 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో తమ వంతు పాత్ర పోషించారు. సఫారీ బౌలర్లలో ప్రిటోరియస్ రెండు వికెట్లు, పార్నెల్, ఇమ్రాన్ తాహిర్ చెరో వికెట్ తీశారు.

290 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన  సఫారీ జట్టు 11 ఓవర్లు ముగిసేసరికి ఆమ్లా(10), డుప్లెసిస్(11) వికెట్లను కోల్పోయింది. డుమిని(34) తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించిన కీపర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీ (57, 65 బంతుల్లో 6 ఫోర్లు) చేసి ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. మిల్లర్(28), కెప్టెన్ డివిలియర్స్(45, 49 బంతుల్లో 2 ఫోర్లు) స్వల్ప విరామాల్లో వెనుదిరగడంతో సఫారీలలో టెన్షన్ మొదలైంది. హాఫ్ సెంచరీతో చివరివరకూ పోరాడిన ప్రిటోరియస్ (50, 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్ కు ఫిహ్లుక్వాయో(29 నాటౌట్) తో కలిసి 61 పరుగులు జోడించాడు. అయితే 49వ ఓవర్ చివరి బంతికి యార్కర్ బంతితో ప్రిటోరియస్ ను కివీస్ బౌలర్ బోల్తా కొట్టిస్తూ బౌల్డ్ చేశాడు. ఆఖరి ఓవర్లో సఫారీల విజయానికి 15 పరుగులు అవసరం కాగా, ఆఖరి ఓవర్ చివరి రెండు బంతులను ఫిహ్లుక్వాయో బౌండరీలకు తరలించడంతో డివిలియర్స్ సేన 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టాడు. సాంట్నర్ రెండు వికెట్లు, సోధీ, గ్రాండ్ హోమ్మీ, సౌతీ తలో వికెట్ తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement