
దక్షిణాఫ్రికా జోరుకు బ్రేక్
రెండో వన్డేలో న్యూజిలాండ్ గెలుపు ∙ రాస్ టేలర్ సెంచరీ
క్రైస్ట్‌చర్చ్: వరుసగా 12 విజయాలతో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టుకు న్యూజిలాండ్ అడ్డుకట్ట వేసింది. బుధవారం జరిగిన రెండో వన్డేలో కివీస్ ఆరు పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో నాలుగు వికెట్లకు 290 పరుగులు సాధించింది. రాస్ టేలర్ (110 బంతుల్లో 102; 8 ఫోర్లు) సెంచరీ చేయగా... విలియమ్సన్ (75 బంతుల్లో 69; 6 ఫోర్లు), నీషమ్ (57 బంతుల్లో 71 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. టేలర్, విలియమ్సన్ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ప్రెటోరియస్ రెండు వికెట్లు తీశాడు.
291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 283 పరుగులు చేసి ఓడిపోయింది. డి కాక్ (65 బంతుల్లో 57; 6 ఫోర్లు), ప్రెటోరియస్ (27 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేసినా కీలక సమయాల్లో దక్షిణాఫ్రికా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది. 214 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయిన దశలో ప్రెటోరియస్, ఫెలుక్‌వాయో (29 నాటౌట్; 4 ఫోర్లు) తొమ్మిదో వికెట్‌కు 59 పరుగులు జోడించారు. ప్రెటోరియస్ అవుటయ్యాక చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆ జట్టు తొమ్మిది పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ మూడు, సాంట్నెర్ రెండు వికెట్లు తీశారు. ఐదు వన్డేల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో వన్డే శనివారం జరుగుతుంది.