
రన్ ఫర్ రియో..
ఢిల్లీ నగరంలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో భారత రియో ఒలింపిక్స్ పరుగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
ఢిల్లీ: నగరంలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో భారత రియో ఒలింపిక్స్ పరుగును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రియో పరుగులో భాగంగా ఆదివారం ఉదయం ఇక్కడకు విచ్చేసిన మోదీ.. తొలుత హాకీ దిగ్గజం ధ్యాన్చంద్కు నివాళులు అర్పించిన అనంతరం రియో పరుగును జెండా ఊపి ఆరంభించారు. దాదాపు ఇరవై వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం నుంచి నెహ్రూ మైదానం వరకూ సాగింది.
ఈ సందర్భంగా భారత అథ్లెట్లకు ముందుగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని క్రీడల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే పలు రకాలుగా క్రీడలకు ఎంతో సహకారం అందించినట్లు ఆయన పేర్కొన్నారు. వందేళ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఒలింపిక్స్ లో భారత ప్రాతినిథ్యం నిజంగా అద్భుతమని మోదీ తెలిపారు. ఈసారి అత్యధిక సంఖ్యలో 119 మంది అథ్లెట్లు ఒలింపిక్స్ లో పాల్గొనడం భారత్ నుంచి ఇదే తొలిసారి కావడం గర్వకారణమన్నారు. వచ్చే 2020 టోక్యో ఒలింపిక్స్ నాటికి మన క్రీడాకారుల సంఖ్య 200కు చేరుతుందని ఆశిస్తున్నట్లు మోదీ తెలిపారు.