ధైర్యం కోల్పోవద్దు: మోదీ
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్లో పాల్గొంటున్న భారత అథ్లెట్లకు మద్దతుగా నిలవాలంటూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన విజ్ఞప్తిపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రియోకు వెళ్లిన అథ్లెట్లు ఎట్టిపరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని మోదీ హితవు పలికారు. జీవితంలో గెలుపు-ఓటములు అనేవి సహజమని, దానిపై ఆలోచించకుండా మెరుగైన ప్రదర్శన ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నించాలని మోదీ పేర్కొన్నారు.
'రియోలో భారత అథ్లెట్లకు ఒకటే విన్నవిస్తున్నా. ధైర్యాన్ని కోల్పోవద్దు. మీ అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి యత్నించండి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఫలితం గురించి ఆలోచించకుండా ప్రదర్శన ఇవ్వండి. మన అథ్లెట్ల ఇప్పటివరకూ పతకం తేలేకపోయినా, వారి ప్రదర్శన గర్వించే విధంగా ఉంది. ఫలితం కోసం ఆలోచించి అదనపు భారాన్ని వేసుకోవద్దు. ఓర్పు, అంకితభావం, పట్టుదల అనేది మాత్రమే ఇక్కడ ప్రధానం. అప్పుడే మనల్ని నిరూపించుకునే ఆస్కారం ఉంది' అని మోదీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మద్దతు తెలిపారు.