నాకు సిగ్గు ఎక్కువ.. మేనేజ్ చేశా: సచిన్
హైదరాబాద్: తన జీవితానికి సంబంధించి ఎవరికీ తెలియని విషయాలు ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ సినిమాలో ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తెలిపాడు. బయోపిక్ గురించి అడిగినప్పుడు చేయాలా, వద్దా చాలా ఆలోచించానని ఎన్‌టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. నా గురించి అభిమానులు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారని అర్థమైందని, అందుకే బయోపిక్‌లో నటించానని వెల్లడించాడు. మొదట్లో కెమెరా ముందు ఇబ్బంది పడ్డానని, తర్వాత అలవాటైందన్నాడు. తనకు సిగ్గు ఎక్కువని, సినిమాలో బాగానే మేనేజ్ చేశానని చెప్పాడు.
తన సినిమా చూసిన తర్వాత అభిమానులు పూర్తి సంతృప్తి చెందుతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. నా జీవితంలో పెద్దగా దాచింది ఏమీ లేదని, దీన్ని ఇతర బయోపిక్‌లతో పోల్చుతారనుకోవడం లేదన్నాడు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడ నాకు మంచి జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పాడు. హైదరాబాద్‌లో ఎండలు ఎక్కువగా ఉన్న ఫ్యాన్స్ చల్లదనాన్ని పంచుతారని పేర్కొన్నాడు. సినిమాకు సంబంధించిన తర్వాత ఇన్నింగ్స్ ఉండదని స్పష్టం చేశాడు. స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ తనకు మంచి మిత్రుడని, ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యారని ప్రశంసించాడు.