క్రికెట్ అభిమానులు ఈ రోజు(మార్చి 16)ను మర్చిపోలేరు. క్రికెట్ చరిత్రలో రెండు సరికొత్త రికార్డులు నమోదయిన రోజు. అందులో ఒకటి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద శతకాలు సాధించింది కాగ, మరొకటి దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మన్ హెర్షల్ గిబ్స్ తొలి సారి ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టి నయా రికార్డు సృష్టించాడు.
హైదరాబాద్ : ఏడేళ్ల క్రితం క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వంద అంతర్జాతీయ శతకాలు సాధించి సరికొత్త రికార్డును సృష్టించింది ఇదే రోజున. ఆసియా కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌పై చేసిన శతకం సచిన్‌కు వన్డేల్లో 49వ సెంచరీ కాగా, టెస్టులు(51), వన్డేల్లో కలుపుకుని వంద సెంచరీలను సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఈ "లిటిల్ మాస్టర్" సరికొత్త రికార్డును సృష్టించాడు. సచిన్ సాధించిన ఈ అరుదైన ఘనతతో యావత్ క్రికెట్ అభిమానులు తెగ పండగ చేసుకున్నారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు రికీ పాంటింగ్(71) సచిన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక టీమిండియా సారథి విరాట్ కోహ్లి ఇప్పటివరకు 66 అంతర్జాతీయ సెంచరీలు సాధించి సచిన్ ‘వంద శతకాల’పై కన్నేశాడు.
సిక్సర్ల సునామీ
ఇక పన్నెండేళ్ల క్రితం సిరిగ్గా ఇదే రోజున దక్షిణాఫ్రికా మాజీ విధ్వంసకర ఆటగాడు హెర్ష్‌లీ గిబ్స్ అద్భుతం చేశాడు. వన్డేల్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది సంచలనం రేపాడు. నెదర్లాండ్స్ స్పిన్నర్ డాన్ వాన్ బుంగీ బౌలింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన గిబ్స్ అతడికి చుక్కలు చూపించాడు. అప్పటివరకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రవిశాస్త్రి, గార్ఫీల్డ్ సోబర్స్ సాధించిన రికార్డే(ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు) అత్యుత్తమం కావడం విశేషం. గిబ్స్ ఈ ఘనత అందుకున్న కొద్ది నెలల అనంతరం టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కూడా ఈ రికార్డు సాధించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రాడ్ బౌలింగ్‌లో యువీ ఈ ఫీట్ అందుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment