సచిన్.. క్రికెట్కు అవసరం: రణతుంగ
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మరికొంత కాలం టెస్టు క్రికెట్ ఆడాలని శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అభిప్రాయపడ్డారు. దీనివల్ల టెస్టు క్రికెట్కు ప్రయోజనం కలుగుతుందని, సచిన్ లాంటి ఆటగాడు అవసరమని అన్నాడు. ఆదివారమిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రణతుంగ మాట్లాడుతూ.. సచిన్ రిటైరయినా టెస్టు క్రికెట్కు మద్దతుగా నిలుస్తాడని భావిస్తున్నట్టు చెప్పాడు.
వెస్టిండీస్తో జరగనున్న సిరీస్లో తన చరిత్రాత్మక 200వ టెస్టు ఆడిన అనంతరం రిటైరవనున్నట్టు మాస్టర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఏ ఆటగాడికైనా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకోవడం కష్టతరమైనదని రణతుంగ అన్నాడు. తాను రిటైరయినపుడు నిర్ణయం తీసుకోవడానికి మూడు రోజులు సమయం పట్టిందని చెప్పాడు. సచిన్ క్రికెట్నే శ్వాస, ఆహారం, నిద్రగా భావించడంతో పాటు వాష్రూమ్లో కూడా దీని గురించే ఆలోచిస్తూ గడిపి ఉంటాడని లంక మాజీ కెప్టెన్ అన్నాడు.