దేవుడా..!
ఎందుకు రిటైరయ్యావ్... నీలో ఇంకా ఇంత ఆట దాచుకుని..! ఎందుకు అభిమానులకు ఈ క్రికెట్ విందు లేకుండా చేశావ్.. నీ అమ్ములపొదిలో అస్త్రాలను అలాగే ఉంచుకొని..! లార్డ్స్‌లో శనివారం సచిన్ టెండూల్కర్ ఆట చూసిన తర్వాత సగటు క్రికెట్ అభిమాని ఆలోచన ఇది. ఆరు నెలల పాటు ఆటకు పూర్తిగా దూరమైనా... మాస్టర్ క్లాస్ తరిగిపోలేదు. బ్యాట్ పట్టకపోయినా షాట్లలో పదును తగ్గలేదు.
స్ట్రయిట్ డ్రైవ్, అప్పర్ కట్, స్క్వేర్ డ్రైవ్, కవర్‌డ్రైవ్... ఇలా తన మార్క్ షాట్లతో అభిమానులను ఓలలాడించాడు. ప్రస్తుతం క్రికెట్‌లో కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్లకంటే అద్భుతంగా ఆడి ఔరా! అనిపించాడు. ఏడు అణిముత్యాల్లాంటి బౌండరీలతో... ‘క్లాస్’ శాశ్వతం అని మరోసారి నిరూపించాడు. క్రికెట్ దేవుడి బ్యాట్ నుంచి ఆ ఆటను మళ్లీ చూసే అవకాశం కల్పించినందుకు థ్యాంక్యూ... లార్డ్స్..!