ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలాడండి: సచిన్
ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలాడండి: సచిన్
Published Wed, Jul 19 2017 9:54 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM
ముంబై: క్రీడల్లో పాల్గొంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ దేశ యువతకు సూచించారు. శారీరక వ్యాయమాలు లేకుండా క్రీడలకు దూరంగా ఉంటూ దేశంలో అనారోగ్య జనాభాను పెంచొద్దని హితవు పలికారు. సోని నెట్‌వర్క్స్ నిర్వహించిన వేడుకలో పాల్గొన్న సచిన్ అనారోగ్యాలతో 2020 వరకు జనాభా పరంగా మనదేశం చాలా చిన్నదిగా మారిపోవచ్చునని.. ఎందుకంటే స్థూలకాయంలో మన దేశం మూడోస్థానంలో ఉందన్నాడు.
మన దగ్గర పెరుగుతున్న అనారోగ్య జనాభే.. రాబోయే విపత్తుకు కచ్చితమైన మూలమని హెచ్చిరించాడు. దీని నుంచి బయటపడాలంటే క్రీడా కార్యకలాపాలు పెరగాలి. ప్రతి ఒక్కరు ఏదో ఒక ఆట ఆడాలన్నాడు. దీంతో శరీరాన్ని, దేశాన్ని రోగాల నుంచి కాపాడుకోవచ్చని మాస్టర్ పిలుపునిచ్చాడు. క్రీడలంటే ప్రొఫెషన్ కాదని, ప్రతి ఒక్కరికి అది శ్వాసగా మారిపోవాలన్నాడు. క్రీడలే నా జీవితం. నాకు అవి ఆక్సిజన్‌లాంటివని తెలిపాడు.
ఆటలు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బ్రతుకలేను. చాలా మంది క్రీడలను ప్రొఫెషన్‌గా భావిస్తారు. అలా భావించడం నాకు ఇష్టం లేదు. అవి అంటే నాకు పిచ్చి. ఎల్లప్పుడూ వాటిపై నాకు అమితాసక్తి అని సచిన్ వెల్లడించాడు. ఫిఫా అండర్-17 వరల్డ్‌కప్‌లో పాల్గొనే భారత్ జట్టుకు పెద్ద సంఖ్యలో మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చిన మాస్టర్.. క్రికెటేతర క్రీడలకు కూడా ప్రోత్సాహం ఇస్తామని చెప్పడానికి ఇదో గొప్ప అవకాశమన్నాడు.
Advertisement