ప్రపంచకప్‌కు అజ్మల్ దూరం
కరాచీ: ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అజ్మల్ ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. టోర్నీకి ముందు అతడు తన బౌలింగ్ శైలిని పరీక్షించుకునే అవకాశం లేకపోవడంతో జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అజ్మల్ తనుకు తానే ఈ టోర్నీకి దూరమయ్యాడని పీసీబీ తెలిపింది. ‘అతడి కెరీర్‌తో మేం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. తాజాగా అతడి బౌలింగ్ శైలి ఇంకా ఐసీసీ నిబంధనలకు లోబడి 15 డిగ్రీల స్థాయికి రావ డం లేదు.
ఒకవేళ ఇప్పుడు అధికారిక బయో మెకానిక్ టెస్టు కోసం వెళ్లి విఫలమైతే రెండేళ్ల వరకు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే అతడి కెరీర్ ముగిసిపోతుంది. అందుకే ఆ టెస్టుకు వెళ్లే దాకా దేశవాళీ టోర్నీలు ఆడాల్సిందిగా సూచించాం’ అని పీసీబీ అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ అన్నారు. ఆల్‌రౌండర్ హఫీజ్ మాత్రం అనధికారిక టెస్టు కోసం చెన్నైకి వెళతాడని, ఇందులో క్లియర్ అయితే ఐసీసీ అధికారిక టెస్టుకు పంపుతామని చెప్పారు.