ICC ban
-
హసరంగపై సస్పెన్షన్ వేటు
శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్ వనిందు హసరంగపై సస్పెన్షన్ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను ఐసీసీ హసరంగపై రెండు మ్యాచ్‌ల సస్పెన్షన్‌తో పాటు మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించింది. ఈ ఘటనతో ఐదు డీ మెరిట్ పాయింట్లను పొందిన హసరంగ.. ఓ టెస్ట్, రెండు టీ20ల్లో (మొదట ఏది వస్తే అది) సస్పెన్షన్‌ను ఎదుర్కొంటాడు. దీంతో మార్చిలో బంగ్లాదేశ్‌తో జరిగే మొదటి రెండు టీ20లకు హసరంగ దూరం కానున్నాడు. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.13ను ఉల్లంఘించినందుకు గాను హసరంగపై చర్యలకు ఆదేశించినట్లు ఐసీసీ ప్రకటన విడుదల చేసింది. హసరంగతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు రహ్మానుల్లా గుర్బాజ్‌పై కూడా ఐసీసీ చర్యలు తీసుకుంది. అదే మ్యాచ్‌లో అంపైర్ సూచనలు దిక్కరించినందుకు గుర్బాజ్ మ్యాచ్ ఫీజ్‌లో 15 శాతం జరిమానా విధించింది. కాగా, శ్రీలంకతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా (ఆఖరి మూడు బంతుల్లో 11 పరుగులు చేయాల్సిన తరుణంలో ).. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ వఫాదర్ మొమంద్ నడుము కంటే ఎత్తులో బంతి వేసినప్పటికీ ఫీల్డ్ అంపైర్ లిండన్ హన్నిబాల్ నో బాల్‌గా ప్రకటించకపోవడంతో హసరంగ ఫైరయ్యాడు. అంపైర్ నిర్ణయంతో చిర్రెతిపోయిన హసరంగ కోపంగా అతని వైపు దూసుకొచ్చి దూషణను దిగాడు. చిన్న పిల్లల్ని అడిగినా ఆ బంతిని నో బాల్‌గా ప్రకటిస్తారు.. కళ్లు కనిపిస్తున్నాయా లేదా.. నువ్వు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లకు పనికిరావు.. వెళ్లి వేరే ఏదైనా పని చూసుకో అంటూ అంపైర్‌పై దూషణ పర్వానికి దిగాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. -
శ్రీలంక క్రికెట్‌కు భారీ ఊరట
శ్రీలంక క్రికెట్‌కు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆ జట్టుపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసింది. నిషేధం ఎత్తివేత తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ ఆదివారం (జనవరి 28) ప్రకటించింది. సభ్య దేశంగా ఉండి బాధ్యతల ఉల్లంఘణకు పాల్పడటంతో పాటు బోర్డు అంతర్గత వ్యవహారాల్లో మితిమీరిన రాజకీయ జోక్యాన్ని సహించని ఐసీసీ నవంబర్ 10న శ్రీలంక క్రికెట్ బోర్డుపై (ఎస్ఎల్సీ) నిషేధాన్ని విధించింది. లంక క్రికెట్ బోర్డు స్వయంప్రతిపత్తిని కోల్పోయి, స్థానిక రాజకీయ నాయకుల చేతుల్లో పావుగా మారి అవినీతి, నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని ఆ దేశ ఆడిటర్ జనరల్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఐసీసీ ఎస్ఎల్సీపై నిషేధం విధించింది. వన్డే వరల్డ్‌కప్ 2023 అనంతరం షమ్మీ సిల్వ నేతృత్వంలోని శ్రీలంక క్రికెట్ బోర్డును ఐసీసీ రద్దు చేసింది. ఎస్ఎల్సీపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో ఆ దేశంలో జరగాల్సిన అండర్-19 వరల్డ్‌కప్ 2024 సౌతాఫ్రికాకు తరలించబడింది. బోర్డు రద్దు అనంతరం రెండు నెలలపాటు పరిస్థితిని సమీక్షించిన ఐసీసీ తాజాగా సమావేశమై నిషేధాన్ని ఎత్తి వేసింది. ఎస్‌ఎల్‌సీలో ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సంతృప్తి వ్యక్తం చేస్తూ బ్యాన్‌ను ఎత్తి వేస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టుకు ఎలాంటి అంతర్జాతీయ కమిట్మెంట్స్ లేకపోవడంతో ఆ దేశ ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ జట్టు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లను ఎంపిక చేసింది. -
డోపింగ్‌లో పట్టుబడ్డ దక్షిణాఫ్రికా క్రికెటర్.. నిషేధం విధించిన ఐసీసీ
దుబాయ్: సౌతాఫ్రికా బ్యాటర్ జుబేర్ హమ్జాపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది. డోపింగ్ నిరోధక నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా హమ్జాను 9 నెలల పాటు క్రికెట్ సంబంధిత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఐసీసీ ఆదేశించింది. డోపింగ్ నిరోధక నియమాన్ని ఉల్లంఘించినట్టు అంగీకరించడంతో హమ్జాపై డిసెంబర్ 22, 2022 వరకు నిషేధం అమల్లో ఉంటుందని ఐసీసీ మంగళవారం ప్రకటించింది. 17 జనవరి 2022న హమ్జా నుంచి సేకరించిన నమూనాలో నిషేధిత పదార్థమైన ఫ్యూరోసెమైడ్ గుర్తించినట్లు ఐసీసీ పేర్కొంది. ఈ ఏడాది జనవరి 17 నుంచే నిషేధం అమల్లో ఉంటున్నందున మార్చి 22న హమ్జా న్యూజిలాండ్‌పై చేసిన 31 పరుగులు రికార్డుల్లో నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. కాగా, 26 ఏళ్ల హమ్జా దక్షిణాఫ్రికా తరఫున 6 టెస్ట్‌లు, ఓ వన్డే ఆడాడు. హమ్జా ఖాతాలో రెండు అర్ధ సెంచరీలు నమోదై ఉన్నాయి. చదవండి: BAN Vs SL Test: టెస్టుల్లో ముష్ఫికర్ రహీమ్ అరుదైన రికార్డు! -
అశ్విన్, జాదవ్‌లపై నిషేదం విధించండి?
సాక్షి, హైదరాబాద్: భారత స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, కేదార్ జాదవ్, హర్భజన్ సింగ్‌ల బౌలింగ్‌పై నిషేదం విధించాలని పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఐసీసీని డిమాండ్ చేస్తున్నారు. దీనికి కారణం పాక్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ అనుమానస్పద బౌలింగ్‌పై మరోసారి నిషేదం విధించడమే. ఇక అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అతడిని గురువారం ఐసీసీ అనర్హుడిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్ బంతులను వేసే సమయంలో తన మోచేతిని నిబంధనలు విరుద్దంగా వంచుతున్నాడని ఐసీసీ పేర్కొంది. ఇలా హఫీజ్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి. 2014 డిసెంబర్లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్ చేయలేదు. ఈ వార్త విన్న హఫీజ్ ట్విట్టర్ వేదికగా తన బాధను వ్యక్త పరిచాడు. ‘తన బౌలింగ్ శైలిని పూర్తిగా మార్చుకున్న తర్వాత కూడా ఐసీసీ నిషేదించడం బాధగా ఉంది. ఇది నన్ను ఎప్పటికి వెనుకడుగేయనివ్వదు. దేశం కోసం ఆడటానికి రెండు సార్లు ఎంతో కష్టపడి నా శైలిని మార్చుకున్నాను.ఇలానే మరింత కష్టపడి దేశం కోసం ఆడుతా’అని ట్వీట్ చేశాడు. ఇక పాక్ అభిమానులు హఫీజ్‌ను ప్రశంసిస్తూ త్వరలో ఐసీసీ నుంచి క్లీన్‌చీట్ అందుతోందని ఈ ఆల్‌రౌండర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. మరి కొందరు భారత బౌలర్ల యాక్షన్ కూడా నిబద్దనలకు విరుద్దంగా ఉందని వారిపై కూడా నిషేదం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేగాకుండా జాదవ్, అశ్విన్, హర్భజన్ బౌలింగ్ యాక్షన్ చిత్రాలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఐసీసీని ప్రశ్నిస్తున్నారు. I don't know kyn icc ko ya nazar nhe ata pic.twitter.com/Ubw6MecWGI — Amir Khan (@Amirkh3456) November 17, 2017 -
ప్రపంచకప్‌కు అజ్మల్ దూరం
కరాచీ: ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ అజ్మల్ ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. టోర్నీకి ముందు అతడు తన బౌలింగ్ శైలిని పరీక్షించుకునే అవకాశం లేకపోవడంతో జట్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అజ్మల్ తనుకు తానే ఈ టోర్నీకి దూరమయ్యాడని పీసీబీ తెలిపింది. ‘అతడి కెరీర్‌తో మేం రిస్క్ తీసుకోదలుచుకోలేదు. తాజాగా అతడి బౌలింగ్ శైలి ఇంకా ఐసీసీ నిబంధనలకు లోబడి 15 డిగ్రీల స్థాయికి రావ డం లేదు. ఒకవేళ ఇప్పుడు అధికారిక బయో మెకానిక్ టెస్టు కోసం వెళ్లి విఫలమైతే రెండేళ్ల వరకు నిషేధం ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇదే జరిగితే అతడి కెరీర్ ముగిసిపోతుంది. అందుకే ఆ టెస్టుకు వెళ్లే దాకా దేశవాళీ టోర్నీలు ఆడాల్సిందిగా సూచించాం’ అని పీసీబీ అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ అన్నారు. ఆల్‌రౌండర్ హఫీజ్ మాత్రం అనధికారిక టెస్టు కోసం చెన్నైకి వెళతాడని, ఇందులో క్లియర్ అయితే ఐసీసీ అధికారిక టెస్టుకు పంపుతామని చెప్పారు. -
షిల్లింగ్‌ఫోర్డ్‌పై ఐసీసీ నిషేధం
దుబాయ్: భారత పర్యటనలో రాణించిన వెస్టిండీస్ ఆఫ్ స్పిన్నర్ షేన్ షిల్లింగ్‌ఫోర్డ్‌పై ఐసీసీ వేటు వేసింది. అతడి బౌలింగ్ శైలి వివాదాస్పదంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మరో ఆఫ్ స్పిన్నర్ మార్లన్ శామ్యూల్స్ ట్వీకర్ బంతులు కూడా నిబంధనలకు విరుద్ధమని తేల్చింది. స్వతంత్ర బయోమెకానికల్ విశ్లేషణ ద్వారా షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్‌ను పరీక్షించగా ఐసీసీ అనుమతించిన 15 డిగ్రీలకు మించి అదనంగా మోచేయిని తిప్పినట్టు తేలింది. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో షిల్లింగ్‌ఫోర్డ్ బౌలింగ్ చేయడాన్ని నిషేధిస్తున్నట్టు, మరో తాజా విశ్లేషణ సమర్పించేదాకా అతడు బౌలింగ్ చేసే అవకాశం లేదని ఐసీసీ పేర్కొంది. ఆఫ్ బ్రేక్ డెలివరీతో పాటు తన దూస్రా కూడా ఇదే రీతిన ఉన్నాయని బయోమెకానికల్ విశ్లేషణలో తేలింది. అలాగే ఆల్‌రౌండర్ శామ్యూల్స్ ప్రామాణిక బౌలింగ్ సరిగానే ఉన్నా ట్వీకర్ (వేగంగా విసరడం) బంతులు మాత్రం ఐసీసీ పరిమితి దాటి ఉండడంతో చట్టవిరుద్ధమని తేలింది. ఇకముందు తను ఇలాంటి బంతులను వేయడం కుదరదని తేల్చింది. గత నెల 29న వీరిద్దరికి పెర్త్‌లో బౌలింగ్ పరీక్ష జరిగింది. మరోవైపు తమ నిషేధంపై బౌలింగ్ రివ్యూ గ్రూప్‌నకు వీరు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని వారు 14 రోజుల్లో ఐసీసీకి తెలపాల్సి ఉంటుంది.