
బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డేవిస్ కప్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రజ్నేశ్ 6–2, 6–2తో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనిపై విజయం సాధించాడు. ప్రజ్నేశ్ బలమైన ఫోర్‌హ్యాండెడ్ షాట్లతో ఫైనల్ ఏకపక్షంగా మారింది. ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించగా.. చెన్నై ప్లేయర్ ప్రజ్నేశ్ ఖాతాలో కేవలం రెండు మాత్రమే చేరాయి. కానీ కీలక సమయాల్లో అనవసర తప్పిదాలు చేసిన సాకేత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైటిల్ విజయంతో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ ర్యాంకుల్లో తన స్థాయిని మెరుగుపరుచుకున్నాడు. తాజాగా 144వ ర్యాంకు నుంచి 110వ స్థానానికి ఎగబాకాడు. మరోవైపు బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే చేరడం విశేషం. గతేడాది సుమీత్ నాగల్ ఈ టోర్నీ విజేతగా నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment