Prajnes gunesvaran
-
కెర్బర్, వీనస్ ఇంటిముఖం
పారిస్: టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ సంచలన ఫలితాలతో ప్రారంభమైంది. తొలి రోజు మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు ప్రపంచ మాజీ నంబర్‌వన్ క్రీడాకారిణులు ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ), వీనస్ విలియమ్స్ (అమెరికా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. ప్రపంచ 81వ ర్యాంకర్ అనస్తాసియా పొటపోవా (రష్యా) 6–4, 6–2తో ఐదో సీడ్ కెర్బర్‌ను బోల్తా కొట్టించగా... తొమ్మిదో సీడ్ ఎలీనా స్వితోలినా (ఉక్రెయిన్) 6–3, 6–3తో 2002 రన్నరప్ వీనస్‌ను ఓడించింది. పొటపోవాతో జరిగిన మ్యాచ్‌లో కెర్బర్ కచ్చితమైన సర్వీస్ చేయలేకపోయింది. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయిన కెర్బర్ 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. స్వితోలినాతో 73 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో వీనస్ ఏదశలోనూ తన ప్రత్యర్థికి పోటీనివ్వలేదు. మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసిన 38 ఏళ్ల వీనస్ ఏకంగా 34 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకుంది. 22వసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో పాల్గొన్న వీనస్ 2006 తర్వాత మళ్లీ ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. మహిళల సింగిల్స్ ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో రెండో సీడ్ కరోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) 6–2, 6–3తో మాడిసన్ బ్రింగిల్ (అమెరికా)పై, మాజీ చాంపియన్, 19వ సీడ్ ముగురుజా (స్పెయిన్) 5–7, 6–2, 6–2తో టేలర్ టౌన్సెండ్ (అమెరికా)పై, 15వ సీడ్ బెలిండా బెన్సిచ్ (స్విట్జర్లాండ్) 6–1, 6–4తో జెస్సికా పొంచెట్ (ఫ్రాన్స్)పై గెలిచి రెండో రౌండ్‌కు చేరుకున్నారు. ఫెడరర్... వరుసగా 60వ సారి పురుషుల సింగిల్స్ విభాగంలో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ శుభారంభం చేశాడు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఫ్రెంచ్ ఓపెన్‌లో ఆడుతున్న మూడో సీడ్ ఫెడరర్ 6–2, 6–4, 6–4తో లొరెంజో సొనెగో (ఇటలీ)పై గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఫెడరర్‌కు తొలి రౌండ్లో వరుసగా 60వ విజయం కావడం విశేషం. 91 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఫెడరర్ ఐదు ఏస్‌లు సంధించాడు. 30సార్లు నెట్ వద్దకు వచ్చి 25సార్లు పాయింట్లు సాధించాడు. ఫెడరర్‌తోపాటు ఆరో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ నిషికోరి (జపాన్), 11వ సీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా) కూడా రెండో రౌండ్లోకి అడుగు పెట్టారు. సిట్సిపాస్ 6–2, 6–2, 7–6 (7/4)తో మార్టెరర్ (జర్మనీ)పై, నిషికోరి 6–2, 6–3, 6–4తో క్వెంటన్ హాలిస్ (ఫ్రాన్స్)పై, సిలిచ్ 6–3, 7–5, 6–1తో ఫాబియానో (ఇటలీ)పై గెలిచారు. ప్రజ్నేశ్‌కు నిరాశ... భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ వరుసగా రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్లోనూ తొలి రౌండ్ దాటలేకపోయాడు. తన ర్యాంకింగ్ ఆధారంగా నేరుగా మెయిన్ ‘డ్రా’లో ఆడిన ప్రజ్నేశ్ 1–6, 3–6, 1–6తో హుగో డెలియన్ (బొలీవియా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ 34 అనవసర తప్పిదాలు చేశాడు. తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను మూడుసార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. తొలి రౌండ్లో ఓడిన ప్రజ్నేశ్‌కు 46 వేల యూరోలు (రూ. 35 లక్షల 77 వేలు) ప్రైజ్‌మనీ లభించింది. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లోనూ ప్రజ్నేశ్ తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. -
రన్నరప్ ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నీ టైటిల్ సాధించాలని ఆశించిన భారత నంబర్‌వన్ ప్లేయర్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్‌కు నిరాశ ఎదురైంది. చైనాలో ఆదివారం ముగిసిన కున్మింగ్ ఓపెన్ టోర్నీలో ప్రజ్నేశ్ రన్నరప్‌గా నిలిచాడు. ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 4–6, 3–6తో ప్రపంచ 211వ ర్యాంకర్ జే క్లార్క్ (బ్రిటన్) చేతిలో ఓడిపోయాడు. రన్నరప్‌గా నిలిచిన ప్రజ్నేశ్‌కు 12,720 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 లక్షల 83 వేలు)తోపాటు 75 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. తాజా ప్రదర్శనతో ప్రజ్నేశ్ తన వ్యక్తిగత ర్యాంకింగ్ ఆధారంగా... జూన్, జూలైలలో జరిగే ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగాల్లో నేరుగా మెయిన్ ‘డ్రా’లో అవకాశాన్ని సంపాదించాడు. -
సెమీస్‌లో ప్రజ్నేశ్
న్యూఢిల్లీ: కున్మింగ్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత నంబర్‌వన్ ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. చైనాలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 80వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 7–5, 6–3తో పదో సీడ్ నికోలా మిలోజెవిచ్ (సెర్బియా)పై విజయం సాధించాడు. 84 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రజ్నేశ్ తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. మరో క్వార్టర్ ఫైనల్లో భారత రెండో ర్యాంకర్ రామ్‌కుమార్ రామనాథన్ 1–6, 6–7 (4/7)తో ఐదో సీడ్ కామిల్ మజార్జక్ (పోలాండ్) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీరామ్ బాలాజీ (భారత్)–జెమీ సెరాటాని (అమెరికా) ద్వయం 6–7 (9/11), 6–4, 9–11తో యాన్ బాయ్–ఫాజింగ్ సన్ (చైనా) జోడీ చేతిలో ఓడిపోయింది. -
ప్రజ్నేశ్‌కు టైటిల్
బెంగళూరు: బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో భారత డేవిస్ కప్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రజ్నేశ్ 6–2, 6–2తో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ సాకేత్ మైనేనిపై విజయం సాధించాడు. ప్రజ్నేశ్ బలమైన ఫోర్‌హ్యాండెడ్ షాట్లతో ఫైనల్ ఏకపక్షంగా మారింది. ఈ మ్యాచ్‌లో సాకేత్ నాలుగు ఏస్‌లు సంధించగా.. చెన్నై ప్లేయర్ ప్రజ్నేశ్ ఖాతాలో కేవలం రెండు మాత్రమే చేరాయి. కానీ కీలక సమయాల్లో అనవసర తప్పిదాలు చేసిన సాకేత్ అందుకు తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఈ టైటిల్ విజయంతో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ ఏటీపీ ర్యాంకుల్లో తన స్థాయిని మెరుగుపరుచుకున్నాడు. తాజాగా 144వ ర్యాంకు నుంచి 110వ స్థానానికి ఎగబాకాడు. మరోవైపు బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్ వరుసగా రెండో ఏడాది భారత క్రీడాకారుడి ఖాతాలోనే చేరడం విశేషం. గతేడాది సుమీత్ నాగల్ ఈ టోర్నీ విజేతగా నిలిచాడు. -
ప్రజ్నేశ్ సంచలనం
స్టుట్గార్ట్ (జర్మనీ): మెర్సిడెస్ కప్ టెన్నిస్ టోర్నీలో భారత ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ సంచలనం సృష్టించాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ 169వ ర్యాంకర్ ప్రజ్నేశ్ 7–6 (8/6), 2–6, 6–3తో ప్రపంచ 23వ ర్యాంకర్ డెనిస్ షపోవలోవ్ (కెనడా)పై గెలుపొంది తన కెరీర్లోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్నాడు. గురువారం జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 75వ ర్యాంకర్ గిడో పెల్లా (అర్జెంటీనా)తో ఆడతాడు. -
ప్రజ్నేశ్‌కు తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్
న్యూఢిల్లీ: భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ తన కెరీర్లో తొలిసారి ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్ టైటిల్ సాధించాడు. చైనాలోని యానింగ్ నగరంలో ఆదివారం ముగిసిన కున్మింగ్ ఓపెన్‌లో ప్రజ్నేశ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో ప్రజ్నేశ్ 5–7, 6–3, 6–1తో మొహమ్మద్ సఫత్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. గంటా 52 నిమిషాల పాటు జరిగిన తుది పోరులో అద్భుత ఆటతీరు కనబర్చిన ప్రజ్నేశ్ చివరకు విజేతగా నిలిచాడు. రెండేళ్ల క్రితం పుణే ఓపెన్ ఫైనల్లో ఓడిన అతను ఈసారి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. ఈ విజయంతో రూ. 14.30 లక్షల ప్రైజ్‌మనీతో పాటు 125 ర్యాంకింగ్ పాయింట్లు అతని ఖాతాలో చేరాయి. దీంతో నేడు విడుదల కానున్న ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ప్రజ్నేశ్ టాప్–200లో చోటు దక్కించుకోనున్నాడు. -
రెండు సింగిల్స్ మనవే
⇒రామ్‌కుమార్, ప్రజ్నేశ్ విజయం ⇒ఉజ్బెకిస్తాన్‌పై 2–0తో ఆధిక్యం ⇒నేడు డబుల్స్ మ్యాచ్ గెలిస్తే వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌కు భారత్ అర్హత నాన్ ప్లేయింగ్ కెప్టెన్ మహేశ్ భూపతి తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా భారత యువ ఆటగాళ్లు రామ్‌కుమార్, ప్రజ్నేశ్ గుణేశ్వరన్ అంచనాలకు అనుగుణంగా రాణించారు. కాస్త పోటీ ఎదురైనా... పట్టుదలతో పోరాడి విజయాలు అందుకున్నారు. ఫలితంగా ఉజ్బెకిస్తాన్‌తో మొదలైన ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. వరల్డ్ గ్రూప్‌నకు అర్హత సాధించేందుకు కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. బెంగళూరు: సొంతగడ్డపై భారత యువ ఆటగాళ్లు మెరిశారు. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి భారత్‌ను 2–0తో ఆధిక్యంలో నిలిపారు. డేవిస్‌కప్ టెన్నిస్ ఆసియా ఓసియానియా గ్రూప్–1 మ్యాచ్‌లో భాగంగా ఉజ్బెకిస్తాన్‌తో జరుగుతోన్న పోటీలో తొలి రోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. తొలి సింగిల్స్‌లో 22 ఏళ్ల రామ్‌కుమార్ రామనాథన్ 6–2, 5–7, 6–2, 7–5తో తెముర్ ఇసామిలోవ్పై గెలుపొందగా... రెండో సింగిల్స్‌లో డేవిస్‌కప్‌లో తన తొలి మ్యాచ్ ఆడుతున్న 26 ఏళ్ల ప్రజ్నేశ్ గుణేశ్వరన్ 7–5, 3–6, 6–3, 6–4తో సంజార్ ఫెజీబ్ను ఓడించాడు. శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో భారత్‌కు విజయం దక్కితే సెప్టెంబరులో జరిగే ప్రపంచ గ్రూప్ ప్లే ఆఫ్ పోటీలకు బెర్త్ ఖాయమవుతుంది. ఈ పోటీలో తమ ఆశలు సజీవంగా ఉండాలంటే డబుల్స్‌లో ఉజ్బెకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇసామిలోవ్తో 3 గంటల 14 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో రామ్‌కుమార్‌కు రెండో సెట్, నాలుగో సెట్లో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైంది. డేవిస్‌కప్‌లో తన ఏడో మ్యాచ్ ఆడుతోన్న రామ్‌కుమార్ తొలి సెట్లో ఇసామిలోవ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. రెండో సెట్లోని 12వ గేమ్‌లో రామ్‌కుమార్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన ఇసామిలోవ్ సెట్‌ను దక్కించుకున్నాడు. మూడో సెట్లో రామ్‌కుమార్ మళ్లీ విజృంభించి రెండు బ్రేక్ పాయింట్లు సంపాదించాడు. నాలుగో సెట్ హోరాహోరీగా సాగినా 11వ గేమ్‌లో ఇసామిలోవ్ సర్వీస్‌ను రామ్‌కుమార్ బ్రేక్ చేశాడు. ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మ్యాచ్ మొత్తంలో రామ్‌కుమార్ 16 ఏస్‌లు సంధించి, 14 డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. ఫెజీబ్తో 2 గంటల 24 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రజ్నేశ్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. డేవిస్‌కప్‌లో తనకు లభించిన తొలి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఎడంచేతి వాటం క్రీడాకారుడైన ప్రజ్నేశ్ మూడో సెట్లో 1–3తో వెనుకబడ్డా వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను దక్కించుకోవడం విశేషం. నాలుగో సెట్లోనూ ఈ చెన్నై ప్లేయర్‌కు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదు.