
మరింత ఎత్తుకు......
అంతర్జాతీయ క్రీడాయవనికపై ఈ ఏడాది భారత క్రీడాకారులు తమ ఉనికిని ఘనంగా చాటుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని మెరుపులు మెరిపిస్తామని... విదేశీ క్రీడాకారుల విజయాలకు దీటుగా మరింత గొప్పగా రాణిస్తామని ఈ ఏడాది భరోసా కల్పించారు. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు ఆకాశమే హద్దుగా తమ అద్వితీయ ప్రదర్శనతో అదుర్స్ అనిపించారు. టెన్నిస్‌లో సానియా మీర్జా, ఆర్చరీలో దీపిక కుమారి, హాకీలో మహిళల జట్టు, చెస్‌లో ద్రోణవల్లి హారిక... ఇలా ఒకరిని మించి మరొకరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి భారత క్రీడారంగాన్ని మరింత ముందుకు, మరింత ఎత్తుకు తీసుకెళ్లారు.
- సాక్షి క్రీడావిభాగం
ఇద్దరూ... ఇద్దరే
ఈ ఏడాది టెన్నిస్‌లో భారత ‘రాకెట్’ దూసుకుపోయింది. మహిళల విభాగంలో సానియా మీర్జా శిఖరాగ్రానికి చేరుకోగా... పురుషుల విభాగంలో లియాండర్ పేస్ వయసు పెరిగినా వన్నె తగ్గని విజయాలతో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. 29 ఏళ్ల సానియా మీర్జాకు ఈ ఏడాది చిరస్మరణీయంగా గడిచింది. మహిళల డబుల్స్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను అందుకోవడంతోపాటు నమ్మశక్యంకానిరీతిలో 10 టైటిల్స్‌ను సొంతం చేసుకొని ఔరా అనిపించింది.
బెథానీ మాటెక్ సాండ్స్ (అమెరికా)తో జతకలిసి సిడ్నీ ఓపెన్‌లో టైటిల్ నెగ్గిన సానియా... మార్చిలో మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో జోడీ కట్టడం ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. హింగిస్‌తో జతగా సానియా చెలరేగిపోయింది. ఇండియన్ వెల్స్, మియామి, చార్ల్స్‌టన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్, గ్వాంగ్‌జూ, వుహాన్, బీజింగ్ టోర్నీల్లో సానియా-హింగిస్ జంట టైటిల్స్ గెల్చుకోవడంతోపాటు సీజన్ ముగింపు టోర్నీ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లోనూ చాంపియన్‌గా నిలిచింది.
ఈ సంవత్సరంలో సానియా మొత్తం 65 మ్యాచ్‌ల్లో గెలిచి, 12 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మొత్తం 15 లక్షల 66 వేల 203 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 10 కోట్ల 35 లక్షల 34 వేలు) సంపాదించింది. అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో సానియా ప్రాతినిధ్యం వహించిన ఇండియన్ ఏసెస్ జట్టు రన్నరప్‌గా నిలువగా... చాంపియన్స్ టెన్నిస్ లీగ్ (సీటీఎల్)లో హింగిస్ సభ్యురాలిగా ఉన్న హైదరాబాద్ ఏసెస్ కూడా రన్నరప్‌గా నిలిచింది.
మరోవైపు పురుషుల డబుల్స్ విభాగంలో 42 ఏళ్ల లియాండర్ పేస్ తన జోరును కొనసాగించాడు. మార్టినా హింగిస్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో మూడు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ (ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) సాధించాడు. ఈ క్రమంలో ఓపెన్ శకంలో అత్యధికంగా తొమ్మిది మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. సీజన్ ఆరంభంలో రావెన్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)తో కలిసి ఆక్లాండ్ ఓపెన్ డబుల్స్ టైటిల్ నెగ్గడంద్వారా పేస్ 1997 నుంచి ఇప్పటిదాకా ప్రతి ఏడాదీ కనీసం ఒక్క టైటిల్ అయినా గెలిచిన అరుదైన రికార్డు నమోదు చేశాడు.
మరో స్టార్ రోహన్ బోపన్న ఈ ఏడాదిని భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్‌గా ముగించాడు. 36 ఏళ్ల బోపన్న ఈ సంవత్సరం నాలుగు డబుల్స్ టైటిల్స్ నెగ్గాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో యూకీ బాంబ్రీ తన కెరీర్‌లో తొలిసారి టాప్-100లో చోటు సంపాదించాడు. డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ మ్యాచ్‌లో భారత్ 1-3తో చెక్ రిపబ్లిక్ చేతిలో ఓడిపోయింది.
హాకీ... చలాకీ...
ఒకవైపు వివాదాలు కొనసాగినా... మరోవైపు భారత పురుషుల, మహిళల హాకీ జట్లు విజయాలు సాధిస్తూ ఈ ఏడాదిని చిరస్మరణీయంగా మార్చాయి. బెల్జియంలోని యాంట్‌వర్ప్‌లో జరిగిన వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్స్ టోర్నీలో ఐదో స్థానం సాధించడంద్వారా భారత మహిళల జట్టు 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పురుషుల జట్టు అజ్లాన్ షా టోర్నీలో కాంస్య పతకం సాధించి సీజన్‌లో శుభారంభం చేసింది. చివర్లో న్యూఢిల్లీలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో కాంస్యం సాధించి అంతర్జాతీయ హాకీ సమాఖ్య టోర్నీలో 33 ఏళ్లుగా ఉన్న పతకం లోటును తీర్చుకుంది. హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో కొత్తగా వచ్చిన రాంచీ రేస్ జట్టు విజేతగా నిలిచింది.
64 గళ్లలో పతకాల గలగల
తమ మేథస్సుకు మరింత పదును పెడుతూ ఈ ఏడాదీ భారత చెస్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది మూడు టోర్నీల్లో టైటిల్ నెగ్గిన భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈసారి జ్యూరిచ్ చాలెంజ్ టోర్నీలో మాత్రమే విజేతగా నిలిచాడు. షామ్‌కిర్ టోర్నీలో, నార్వే టోర్నీలో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. లండన్ క్లాసిక్ టోర్నీలో మాత్రం తొమ్మిదో స్థానంతో నిరాశ పరిచాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారికకు ఈ ఏడాది మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఏప్రిల్‌లో రష్యాలో జరిగిన ప్రపంచ మహిళల వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్లో నిష్ర్కమించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది.
ఏప్రిల్‌లోనే చైనాలో జరిగిన ప్రపంచ మహిళల టీమ్ చాంపియన్‌షిప్‌లో రెండో బోర్డుపై ఆడుతూ హారిక రజతం దక్కించుకుంది. ఇక నవంబరులో రోమ్‌లో జరిగిన తొలి ప్రపంచ ఆన్‌లైన్ బ్లిట్జ్ టోర్నమెంట్‌లో హారిక అగ్రస్థానాన్ని సాధించి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ప్రపంచ రెండో ర్యాంకర్ కోనేరు హంపి చైనాలో జరిగిన ప్రపంచ టీమ్ చాంపియన్‌షిప్‌లో మొదటి బోర్డుపై మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత మొనాకోలో జరిగిన గ్రాండ్‌ప్రిలోనూ కాంస్యం సొంతం చేసుకుంది. భారత రెండో ర్యాంకర్ పెంటేల హరికృష్ణ పోకెర్‌స్టార్ ఐల్ ఆఫ్ మ్యాన్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఇక గ్రీస్‌లో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, మూడేసి రజత, కాంస్య పతకాలు లభించాయి.
‘పట్టు’ పట్టారు
ఏడేళ్ల క్రితం బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్య పతకం నెగ్గినప్పటి నుంచి భారత రెజ్లర్ల విజయాలు వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ ఏడాదీ భారత రెజ్లర్లు తమ ‘పట్టు’తో పలు పతకాలు కొల్లగొట్టారు. గాయం కారణంగా స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ వైదొలగడంతో... అతని స్థానంలో బరిలోకి దిగిన మహారాష్ట్ర రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో 74 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించి రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ప్రపంచ క్యాడెట్ చాంపియన్‌షిప్‌లలో భారత రెజ్లర్లు అనిల్ కుమార్ (50 కేజీలు), అంకుష్ (38 కేజీలు) స్వర్ణ, రజత పతకాలు... ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రవి కుమార్ (55 కేజీలు) రజతం సాధించారు. కజకిస్తాన్‌లో జరిగిన ప్రెసిడెంట్ కప్ టోర్నీలో మహిళా రెజ్లర్లు అనిత, నవ్‌జ్యోత్ కౌర్, లలిత, సాక్షి మలిక్, నిక్కీ, నిర్మలా దేవి, వినేశ్ ఫోగట్ రజత పతకాలు నెగ్గారు. మిగతా లీగ్‌లతో స్ఫూర్తి పొంది రెజ్లింగ్‌లోనూ ఈ ఏడాది తొలిసారిగా ప్రొ రెజ్లింగ్ లీగ్ ప్రారంభమైంది.
‘పంచ్’ పవర్
ఈసారి మన పంచ్ ‘పవర్’ పెరిగింది. ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో శివ థాపా (56 కేజీలు) కాంస్యం నెగ్గి ఈ మెగా ఈవెంట్ చరిత్రలో పతకం నెగ్గిన మూడో భారతీయ బాక్సర్‌గా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్, వికాస్ కృషన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. అందర్నీ ఆశ్చర్యపరుస్తూ స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొఫెషనల్‌గా మారాడు. ఈ హరియాణా బాక్సర్ వరుసగా మూడు బౌట్‌లలో తన ప్రత్యర్థులను నాకౌట్ చేసి ఈ ఏడాదిని ఘనంగా ముగించాడు.
గతేడాది ఆసియా క్రీడల్లో పతకం స్వీకరించేందుకు నిరాకరించి ఏడాదిపాటు సస్పెన్షన్‌కు గురైన మహిళా బాక్సర్ సరితా దేవి ఈ ఏడాది మళ్లీ రింగ్‌లోకి దిగింది. రియో ఒలింపిక్స్ టెస్ట్ ఈవెంట్ టోర్నీలో స్టార్ మహిళా బాక్సర్ మేరీకోమ్ (51 కేజీలు)... ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ (48 కేజీలు) కాంస్య పతకాలు నెగ్గారు. అయితే ‘బాక్సింగ్ ఇండియా’లో అంతర్గత వివాదాల కారణంగా అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం ‘బాక్సింగ్ ఇండియా’పై మళ్లీ సస్పెన్షన్ విధించింది. దాంతో భారత బాక్సర్లు అంతర్జాతీయ టోర్నీలో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం పతాకంపై పోటీపడ్డారు.
బాణం... అదుర్స్
ఈ ఏడాది మన ఆర్చర్ల గురి అదిరింది. ముఖ్యంగా మహిళా ఆర్చర్లు నిలకడగా రాణించారు. దీపిక కుమారి, రిమిల్ బురులీ, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం నెగ్గి వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. వ్యక్తిగతంగా దీపిక సీజన్ ముగింపు టోర్నీ వరల్డ్‌కప్ ఫైనల్స్ (మెక్సికో)లో రజతం, టర్కీలో జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో కాంస్యం సాధించింది.
పురుషుల విభాగంలో మంగళ్ సింగ్ చాంపియా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొని వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పోలండ్‌లో జరిగిన ప్రపంచకప్ టోర్నీలో మంగళ్ సింగ్ రజతం సాధించాడు. పురుషుల కాంపౌండ్ సింగిల్స్ విభాగంలో రజత్ చౌహాన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ఆర్చర్‌గా గుర్తింపు పొందాడు.
ఒకే ఒక్కడు...
కల నిజమైనట్లుగా... విఖ్యాత ఎన్‌బీఏ బాస్కెట్‌బాల్ లీగ్‌లో భారత ప్లేయర్ విన్యాసాలు కనిపించాయి. ఈ ఏడాది జరిగిన ఎన్‌బీఏ ఆటగాళ్ల డ్రాఫ్ట్‌లో పంజాబ్‌కు చెందిన సత్నామ్ సింగ్‌ను డల్లాస్ మావెరిక్స్ జట్టు కొనుగోలు చేసింది. భారత ప్లేయర్‌ను ఎన్‌బీఏ జట్టు కొనుగోలు చేయడం ఇదే ప్రథమం.